తెలంగాణ ప్రజలకు శుభవార్త.. కొత్త రైల్వే లైన్‌కు ఏర్పాట్లు
తెలంగాణలో కొత్త రైల్వేలైన్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కొత్త రైల్వే లైన్ డోర్నకల్ జంక్షన్ నుంచి మిర్యాలగూడ వరకూ నేలకొండపల్లి మీదుగా ఏర్పాటు కానుంది. ఈ మేరకు కొత్త రైల్వే మార్గానికి రైల్వేశాఖ ఫైనల్ లొకేషన్ సర్వేను చేపట్టింది. సుమారుగా 97 కిలోమీటర్ల మేర ఈ రైల్వే లైను నిర్మాణం జరగనుంది. కొత్త రైల్వే లైను కోసం గతంలోనే రూ.2,160 కోట్ల అంచనా వ్యయంగా రైల్వేశాఖ నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజాగా తెలంగాణలో ఏర్పాటు కానున్న కొత్త రైల్వే లైనుపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. డోర్నకల్- మిర్యాలగూడ రైల్వేలైన్ డీపీఆర్ సర్వే పనులను చేపట్టినట్లుగా వెల్లడించారు. లోక్‌సభలో బీఆర్ఎస్ ఎంపీ నామానాగేశ్వరరావు కొత్త రైల్వే లైనుకు సంబంధించి ప్రశ్నించారు. ఆ సందర్భంగా మంత్రి అశ్వినీ వైష్ణవ్ బదులిస్తూ..కొన్ని అంశాల ఆధారంగా రైల్వే ప్రాజెక్టు ఎలైన్‌మెంట్‌ను పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలిపారు. త్వరలోనే ఆ మార్గంలో రైళ్లు పరుగులు పెట్టనున్నట్లు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా 15 కొత్త రైల్వే మార్గాలను మంజూరు చేశామని, అందులో డోర్నకల్- మిర్యాలగూడెం ప్రాజెక్టు కూడా ఉందని తెలిపారు. ఆ రైలు మార్గం రాజధాని నగరాలైన హైదరాబాద్, విజయవాడ, చెన్నై, న్యూఢిల్లీకి అనుసంధానం అవుతుందన్నారు. తద్వారా రవాణా సులభతరం అవుతుందన్నారు. సింగరేణి నుంచి బొగ్గును, సూర్యాపేట జిల్లా నుంచి ధాన్యం, బియ్యం, ఖమ్మం జిల్లా నుంచి నేలకొండపల్లి, ముదిగొండ ప్రాంతాల్లోని గ్రానైట్ పరిశ్రమలు, నల్లగొండ సిమెంట్ ఇంకా మరిన్ని పరిశ్రమల నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు ఈ కొత్త రైల్వే లైను మార్గం ద్వారా రవాణా చేసుకునే సౌలభ్యం కలుగుతుందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.