మహదేవ్ యాప్ సహా 22 బెట్టింగ్ యాప్‌లపై నిషేధం
మహదేవ్ సహా 22 బెట్టింగ్ యాప్‌లపై కేంద్రం నిషేధం విధించింది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్, సమాచార, సాంకేతిక పరిజ్ఞాన మంత్రిత్వశాఖ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో మహాదేవ్ బుక్ అక్రమ బెట్టింగ్ సిండికేట్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించగా.. అక్రమ కార్యకలాపాలు సాగిస్తున్నట్టు వెల్లడయ్యిందని కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో చర్యలు తీసుకున్నామని స్పష్టం చేసింది.
ఇలాంటి బెట్టింగ్ యాప్‌లను నిషేధించే అధికారం ఉన్నప్పటికీ వాటిని నిషేధించాలంటూ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఎప్పుడూ తమకు విజ్ఞప్తి చేయలేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు.. ‘ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి సెక్షన్ 69A IT (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) చట్టం ప్రకారం వెబ్‌సైట్/ యాప్‌ను నిషేధించేందుకు సిఫార్సు చేసే అధికారం ఉంది. అయితే, వారు అలా చేయలేదు.. ఏడాదిన్నరగా దర్యాప్తు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అటువంటి అభ్యర్థన రాలేదు. వాస్తవానికి ఈడీ మొదటిసారి అభ్యర్థించడంతో చర్యలు తీసుకున్నాం..’ అని ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో మహదేవ్‌తో పాటు రెడ్డి అన్నప్రెస్టొప్రో లాంటి 22 బెట్టింగ్ యాప్‌లు, వెబ్‌సైట్‌లపై తమ మంత్రిత్వ శాఖ నిషేధం విధించిందన్నారు. అయితే, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ తనను యూఏఈకి వెళ్లాలని కోరినట్లు నిందితుడు పేర్కొన్న రోజునే ప్రభుత్వం ఈ చర్య తీసుకోవడం గమనార్హం.