బాధ్యతగల ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ.. ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఉచిత ఫోన్ ఆశ చూపి ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడిన అమానవీయ ఘటన రాజస్థాన్ లోని కరౌలీ జిల్లా తోడాభీమ్ లో చోటుచేసుకుంది. కరౌలీ జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సునీల్ కుమార్ జన్ గిడ్ అనే వ్యక్తి రాష్ట్ర ప్రజారోగ్య శాఖలో ఇంజినీరింగ్ విభాగంలో క్యాషియర్ గా పనిచేస్తున్నాడు. తోడాభీమ్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల మైనర్ బాలికను బలవంతం చేశాడు.
బాలిక తల్లిదండ్రులు కూలికి వెళ్లి సమయం చూసిన సునీల్.. వాళ్ల ఇంటికి వెళ్లి ప్రభుత్వ ఫ్రీగా మొబైల్ ఫోన్ పంపిణీ చేస్తోందని చెప్పాడు. తనతో వస్తే ఫోన్ ఇప్పిస్తానని చెప్పి.. ఆమెను తన బైక్ పై ఎక్కించుకుని ఆఫీస్ కు తీసుకెళ్లాడు. అక్కడ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ప్రతిఘటిస్తే కత్తితో చేతులపై దాడిచేశాడని బాలిక ఫిర్యాదులో తెలిపింది. తర్వాత తనను ఇంటి దగ్గర విడిచిపెట్టి వెళ్లిపోయాడు. గాయాలతో ఇంటికి చేరుకున్న బాలికను చూసిన తల్లిదండ్రులు మందలించగా.. విషయం బయటపెట్టింది. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.