'చంద్రయాన్ డిజైనర్'.. మితుల్ త్రివేది అరెస్ట్

Byline :  Veerendra Prasad
Update: 2023-08-30 04:16 GMT

చంద్రయాన్‌-3 ప్రాజెక్టులోని ల్యాండర్‌ మాడ్యూల్‌ సృష్టికర్తను తానేనంటూ చెప్పుకుంటున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇస్రోకు అభినందనలు వ్యక్తమవుతున్న వేళ.. గుజ‌రాత్ సూరత్‌కు చెందిన మితుల్‌ త్రివేది అనే వ్యక్తి తనను తాను ఇస్రో శాస్త్రవేత్తనని, విక్రమ్‌ ల్యాండర్‌ మాడ్యూల్‌ను రూపొందించానని చెప్పుకుంటూ మీడియాకు వ‌రుస‌పెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అయితే అసలు అతడు సైంటిస్ట్ కాదని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకొని మంగళవారం అరెస్ట్ చేశారు. మితుల్‌ త్రివేది "ప్రాచీన సైన్స్ అప్లికేషన్ డిపార్ట్‌మెంట్"కి "అసిస్టెంట్ చైర్మన్"గా పోజులిచ్చాడని.. ఫిబ్రవరి 26, 2022 నాటి నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్‌ను కూడా తయారు చేశాడని ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

"ఆ వ్యక్తికి ఇస్రో యొక్క చంద్రయాన్ -3 మిషన్‌తో ఏ విధంగానూ సంబంధం లేదని, ఇస్రో ఉద్యోగి అంటూ అతడు తప్పుడు వాదనలు చేసినట్లు సమగ్ర దర్యాప్తులో తేలింది" అని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. అతడు ఇస్రో నెక్స్ట్ ప్రాజెక్ట్ అయినటువంటి "మెర్క్యురీ ఫోర్స్ ఇన్ స్పేస్" కోసం "అంతరిక్ష పరిశోధన సభ్యుడు" అనే నకిలీ లెటర్ ను కూడా తయారు చేశాడన్నారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సహకరించనప్పటికీ ఇస్రోకు సంబంధించి తప్పుడు వార్తలు వ్యాప్తి చేసి, సంస్థ ప్రతిష్టను దెబ్బతీశాడని.. అందుకు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

అంతకుముందు మితుల్‌ త్రివేది మూన్‌ మిషన్‌లో పని చేసేందుకు ఇస్రో తనను ఆహ్వానించిందని చెప్పుకున్నాడు. ఇస్రోలో పని చేస్తున్న సమయంలో ల్యాండర్‌లో అనేక మార్పులు చేశానని, దీని ఫలితంగానే మాడ్యూల్‌ విజయవంతంగా చంద్రుడిపై ల్యాండ్‌ అయ్యిందని డైలాగులు కొట్టాడు. అయితే, ఇస్రో శాస్త్రవేత్తగా పని చేస్తున్నారా? అని ప్రశ్నించగా ఫ్రీలాన్సర్‌గా అంటూ సమాధానం ఇచ్చాడు. అయితే, తాను నాసాతో కూడా కలిసి పని చేస్తున్నట్లు పేర్కొంటుండడం గమనార్హం.

Tags:    

Similar News