Gyanvapi mosque Case: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు.. పిటిషన్‌ కొట్టివేత

Update: 2023-08-03 06:17 GMT

ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. జ్ఞానవాపి మసీదు సముదాయంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI) సర్వేకు హైకోర్టు అనుమతినిచ్చింది. జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో ఏఎస్‌ఐ సర్వే నిర్వహించాలన్న జిల్లా కోర్టు ఆదేశాలను ధర్మాసనం గురువారం సమర్థించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ సర్వేకు వ్యతిరేకంగా దాఖలైన (ముస్లిం పక్షం పిటిషన్‌ను)పిటిషన్లను కొట్టేసింది. న్యాయ ప్రయోజనాల దృష్ట్యా ఏఎస్‌ఐ సర్వే అవసరమని పేర్కొంది.అయితే, సర్వే సమయంలో మసీదు కట్టడానికి ఎలాంటి నష్టం జరగకుండా చూయాలని సూచించింది.




 


జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో ఏఎస్‌ఐ సర్వే చేయడానికి అలహాబాద్ హైకోర్టు అనుమతి ఇచ్చిందని హిందూ పిటిషనర్ల తరఫు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తెలిపారు. సెషన్స్ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించిందని అన్నారు. జ్ఞానవాపి మసీదు సముదాయాన్ని ఏఎస్​ఐ సర్వే చేసేందుకు అలహాబాద్ హైకోర్టు అనుమతి ఇవ్వడంపై ఉత్తర్​ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్​ ప్రసాద్ మౌర్య స్పందించారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని ఆయన తెలిపారు. అలాగే ఏఎస్​ఐ సర్వే తర్వాత నిజం బయటకు వస్తుందని.. జ్ఞానవాపి సమస్య పరిష్కారమవుతుందని తాను విశ్వసిస్తున్నానని అభిప్రాయపడ్డారు.

యూపీలోని కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే జ్ఞానవాపి మసీదు ఉంది. జ్ఞాన్‌వాపి కాంప్లెక్స్‌లోని హిందూ దేవతలను సంవత్సరంలో అన్ని రోజులూ పూజించడానికి అనుమతి కోసం మహిళల బృందం 2021లో వారణాసిలోని దిగువ కోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పిటిషన్ ఆధారంగా మసీదు కాంప్లెక్స్‌ను వీడియో సర్వే చేయాలని గతేడాది ఏప్రిల్‌లో కోర్టు ఆదేశించింది. గతేడాది మే నెలలో సర్వే నిర్వహించినప్పుడు కనుగొనబడిన ఒక నిర్మాణాన్ని పిటిషనర్లు శివలింగం అని పేర్కొన్నారు. అయితే మసీదు నిర్వహణ కమిటీ మాత్రం ఈ నిర్మాణం 'వజుఖానా'లోని ఫౌంటెన్‌లో భాగమని, ఇది నీటితో నిండిన ప్రాంతమని అంటోంది. ఈ విషయం మీదే ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టులో విచారణ జరుగుతోంది.




Tags:    

Similar News