ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు మంగళవారం అర్ధరాత్రి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో హరీష్ రావత్ గాయాలపాలయ్యారు. మంగళవారం రాత్రి హల్ద్వానీ నుంచి ఉధమ్‌సింగ్ నగర్‌లోని కాశీపూర్‌కు ఆయన కారులో బయలుదేరారు. బాజ్పూర్ వద్దకు చేరుకోగానే రావత్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి.
కారు ప్రమాదంలో గాయపడిన హరీష్ రావత్ ను వెంటనే దగ్గరోని హాస్పిటల్ కు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. రావత్ ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. ప్రమాదానికి సంబంధించి హరీష్ రావత్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తనకు తీవ్రగాయాలేమీకాలేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.