మంత్రి ఇంటిలోకి భారీగా వరద నీరు...

Update: 2023-07-12 15:23 GMT

ఉత్తరాదిని భారీ వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, యూపీ, ఉత్తరాఖండ్‌లో గత మూడు, నాలుగు రోజులుగా వర్షాలతో జనజీవనం అస్థవ్యస్తమైంది. భారీ వరదలకు రహదారులు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. అనేకమంది ప్రాణాలు కొల్పోతున్నారు. వేల కోట్లలో ఆస్తి నష్టం జరిగింది.

కుండపోత వర్షానికి హర్యానా ప్రాంతంలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు అందరికీ ఈ వరద కష్టాలు వెంటాడుతున్నాయి. రాష్ట్ర హోంమంత్రి అనిల్‌ విజ్‌ నివాసంలోనూ వరద నీరు చేరింది.అనిల్‌ ఇంటి ముందు మోకాలిలోతు నీరు చేరిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

హోంమంత్రి నివాసం ఉన్న వీధి మొత్తం చెరువును తలపిస్తోంది. అతని ఇళ్లు నీట మునిగినా...అనిల్‌ విజ్‌ మాత్రం ఇంట్లో నుంచి బయటకు వచ్చి విధులను నిర్వహిస్తున్నారు. బోటులో నగరమంతా తిరిగి పరిస్థితులను పరిశీలించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.


Tags:    

Similar News