JJP MLA కి చేదు అనుభవం.. చెంప దెబ్బ కొట్టిన మహిళ

Update: 2023-07-13 01:52 GMT

ఉత్తరాదిన కురుస్తున్న భారీ వర్షాలు.. పలు రాష్ట్రాలను అల్లకల్లోలానికి గురి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఏకధాటిగా కురుస్తోన్న వర్షాలకు నదులు పోటెత్తుతున్నాయి.. ఉప్పొంగి ప్రవహిస్తోన్నాయి. భారీ వరదలకు పలు రోడ్లు, వంతెనలు కొట్టుకపోతున్నాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్.. అంతటా ఇదే పరిస్థితి. వరద బాధితులకు సాయం చేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాధితులకు తక్షణ సాయం అందజేయాలన్న ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు కూడా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు.




 


ఈ క్రమంలోని హర్యానాలోని గుహ్లా నియోజకవర్గానికి చెందిన JJP ఎమ్మెల్యేకు ఓ చేదు అనుభవం ఎదురైంది. బుధవారం(నిన్న) కైతాల్ జిల్లాలోని వరద బాధితులకు పరామర్శించేందుకు వెళ్లిన జననాయక్ జనతా పార్టీ (జెజెపి) ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్‌ను.. ఓ మహిళ చెంప చెళ్లుమనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నియోజకవర్గంలోని భాటియా గ్రామం.. భారీ వర్షాలకు, వరదలకు తీవ్ర నష్టాన్ని చూసింది. ఈ పరిస్థితిపై సమీక్షించేందుకు ఎమ్మెల్యే బాధిత ప్రాంతానికి వెళ్లగా.. గ్రామస్తులు అతని పర్యటనను వ్యతిరేకిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ జిల్లాలో భారీ వరదలు విధ్వంసం సృష్టించి, అంతా కోల్పోయాక... రెండు రోజుల తర్వాత తమను పరామర్శించడానికి వచ్చారా అంటూ నిలదీశారు. ఈ క్రమంలోనే ఓ మహిళ ఆగ్రహంతో ఎమ్మెల్యేను చెప్పుతో కొట్టింది. ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటోన్నామంటూ ఆయన వివరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. వారు వినిపించుకోలేదు. మాట్లాడుతుండగానే ఇప్పుడు తీరిగ్గా వస్తోన్నావా? అంటూ నిలదీసిన ఆమె అందరూ చూస్తుండగానే ఎమ్మెల్యేను కొట్టారు.దీనితో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.




 


స్థానిక ఘగ్గర్ నది పొంగిపొర్లడంతో ఆ జిల్లాలో వరద పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. అయితే ఘటన జరిగిన తర్వాత ఎమ్మెల్యే నుంచి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. హర్యానాలో సోమవారం భారీ వర్షాలు కురిశాయి. నివేదికల ప్రకారం, ఘగ్గర్ నది పొంగి ప్రవహించడంతో కైతాల్ జిల్లాలోని దాదాపు 40 గ్రామాలు ముంపునకు గురయ్యాయి.




Tags:    

Similar News