కేసీఆర్కు షాకిచ్చిన కుమార స్వామి.. NDAలో చేరిన జేడీఎస్

By :  Kiran
Update: 2023-09-22 12:05 GMT

బీజేపీతో జేడీఎస్ మళ్లీ జట్టుకట్టింది. మాజీ ప్రధాని, జనతాదళ్ సెక్యూలర్ చీఫ్ హెచ్డీ దేవెగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షాతో ఢిల్లీలో సమావేశమయ్యారు. అనంతరం బీజేపీ నేతత్వంలోని ఎన్డీఏలో భాగస్వామ్యపక్షంగా చేరారు. ఈ సమావేశంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్ కూడా పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. శుక్రవారం అధికారికంగా బీజేపీతో చేతులు కలిసినట్లు ప్రకటించారు. ఇవాళ్టి సమావేశంలో ప్రాథమిక అంశాలపై చర్చించామని, తమ తరఫున ఎలాంటి డిమాండ్లు చేయలేదని చెప్పారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కుమార స్వామి బీజేపీ పంచన చేరుతారని కర్నాటక రాజకీయాల్లో గత కొంతకాలంగా చర్చ నడుస్తోంది. తాజాగా ఆ ఊహాగానాలు నిజమయ్యాయి.

2019 సార్వత్రిక ఎన్నికల్లో జేడీఎస్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. అయితే రాష్ట్రంలోని 28 సీట్లలో బీజేపీ 25 తన ఖాతాలో వేసుకుంది. మాండ్య నియోజకవర్గంలో బీజేపీ సపోర్ట్ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి సైతం విజయం సాధించాడు. ఇటీవల జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ కేవలం 19 సీట్లు మాత్రమే గెలుచుకుంది. పార్టీ చరిత్రలో ఇంత తక్కువ స్థానాలు గెలుపొందడం ఇదే తొలిసారి.

జులైలో ఢిల్లీలో ఎన్డీఏ, బెంగళూరు వేదికగా ఇండియా కూటమి సమావేశాలు జరిగాయి. అయితే ఈ రెండు కూటములు కూడా జేడీఎస్ను దూరం పెట్టాయి. ఈ క్రమంలో తాజాగా జేడీఎస్ ఎన్డీఏలో చేరడం హాట్ టాపిక్గా మారింది. మరోవైపు కర్నాటకలో జేడీఎస్ - బీజేపీ మధ్య సీట్ల పంపకంపై త్వరలోనే నిర్ణయం ఉంటుందని కుమారస్వామి ఈ అంశంపై చర్చలు జరుపుతారని దేవెగౌడ ప్రకటించారు. త్వరలోనే ఆయన అమిత్ షాతో సమావేశమై ఈ అంశంపై చర్చిస్తారని చెప్పారు.

ఇదిలా ఉంటే మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో జేడీఎస్ చేరడంతో తెలంగాణ సీఎం కేసీఆర్కు షాక్ తగిలినట్లైంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు బీఆర్ఎస్, జేడీఎస్ మధ్య సత్సంబంధాలు కొనసాగాయి. అనంతరం ఆ రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో మోడీని తీవ్రంగా వ్యతిరేకించే కేసీఆర్ను కాదని కుమారస్వామి ఎన్డీఏలో చేరడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News