దేశవ్యాప్తంగా దంచికొడుతున్న వానలు..

Update: 2023-07-22 14:06 GMT

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ప్రవాహానికి బైక్ లు, కార్లు, పశువులు కొట్టుకుపోతున్నాయి. గుజరాత్, మహారాష్ట్రల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

కుండపోత వర్షాలతో గుజరాత్ అతలాకుతలం అవుతోంది. రాష్ట్రంలోని పలు నగరాలు వరద నీటిలో మునిగిపోయాయి. జునాఘడ్ జిల్లాలో వరద ఉద్ధృతికి కారు కొట్టుకుపోయింది. జులై 24 వరకు వర్షాలు కొనసాగుతాయని ప్రకటించిన వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాల్సాద్, భావ్ నగర్, దేవ్ భూమి ద్వారక, దాద్రా నగర్ హవేలీ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావచ్చని చెప్పింది.

మహారాష్ట్రపైనా వరుణిడి ప్రకోపం కొనసాగుతోంది. పలు జిల్లాల్లో కుండపోతగా వర్షం పడుతోంది. పాల్ఘర్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ముంబై, థానే, రాయ్ ఘడ్, రత్నగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పూనేలోని కొండ ప్రాంతాలు, కొంకణ్, మధ్య మహారాష్ట్రలో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. జనం బయట అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. రాయ్ ఘడ్ జిల్లాలోని ఇర్షాల్వాడీలో శుక్రవారం కొండచరియ విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక సిబ్బంది శిథిలాల కింద నుంచి ఇప్పటి వరకు 27 మృతదేహాలను వెలికితీశారు.

జమ్మూ కాశ్మీర్లోనూ పరిస్థితి దారుణంగా మారింది. వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రికులను ఎక్కడికక్కడ నిలిపేశారు. భారీ వర్షం, కొండ చరియలు విరిగిపడుతుండటంతో జమ్మూ శ్రీనగర్ నేషనల్ హైవేను మూసివేశారు. కశ్మీర్ ను మిగతా దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే మెహర్,దల్వాస్ ప్రాంతాల్లోని 270 కిలో మీటర్ల హైవేపై పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.

Tags:    

Similar News