Chennai Rains : తమిళనాడును వదలని వానలు.. స్కూళ్లకు సెలవులు
తమిళనాడును భారీ వర్షాలు వదలడం లేదు. మొన్నటి వరకు తుఫాన్ తో అతలాకుతలమైన ఆ రాష్ట్రాన్ని ఇప్పుడు వర్షాలు మరోసారి ముంచెత్తుతున్నాయి. కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్‌కాసి జిల్లాల్లో అతి భారీవర్షాలు పడ్డాయి. నాలుగు జిల్లాల్లో భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక వచ్చే 2, 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో ఇవాళ విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో ఆదివారం భారీ వర్షపాతం పడింది. పాళయంకోట్టైలో 26 సెంటీమీటర్లు, కన్యాకుమారిలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరునల్వేలి జిల్లాలో వరద బాధితులను షెల్టర్ క్యాంపుకు తరలించారు. తుటికోరిన్ జిల్లాలోని తిరుచెందూర్‌లో సోమవారం ఉదయం వరకు 606 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రైలు పట్టాలపైకి వరదనీరు ప్రవేశించడంతో పలు రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. అధికారులు సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు.