రేపటినుంచి పెట్రోల్, డీజిల్ వాహనాలు కొనొద్దు: సీఎం ఆదేశం
హిమాచల్ ప్రదేశ్ సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు జనవరి 1 నుంచి పెట్రోల్, డీజిల్ వాహనాలు కొనొద్దని సూచించారు. రాష్ట్రంలోని ప్రభుత్వం శాఖలేవీ రేపటినుంచి డీజిల్, పెట్రోల్ వాహనాలను కొనుగోలు చేయొద్దని ఆదేశించారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ను ప్రోత్సహించడంతో పాటు.. ‘గ్రీన్ అండ్ క్లీన్ హిమాచల్’ లక్ష్యంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. ఒకవేళ ఏదైనా ప్రభుత్వం శాఖలు ఇంధన వాహనాలను కొనుగోలు చేయాలనుకుంటే.. ముందుగా కేబినెట్ ఆమోదం తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.
హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటి వరకు ప్రభుత్వ ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 185కు చేరుకోగా.. ప్రైవేటు ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 2,733కు చేరుకుంది. కాగా ఈ విషయంపై సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు హర్షం వ్యక్తం చేశారు. ఇతర ప్రభుత్వం శాఖలన్నీ ఇదే విధానాన్ని అనుసరించాలని కోరారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కొత్త ఆరంభం మాత్రమే కాదు.. పర్యావరణ పరిరక్షణ పట్ల నిబద్ధత అని ఆయన తెలియజేశారు.