బిల్కిస్‌ బానో కేసు.. గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం చీవాట్లు

Update: 2023-08-18 02:37 GMT

బిల్కిస్‌ బానో కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడ్డ 11 మంది ఖైదీలను 14 ఏళ్ల శిక్షాకాలం పూర్తి కాగానే గుజరాత్ ప్రభుత్వం ముందస్తుగా విడుదల చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. 2002 అల్లర్ల సమయంలో బిల్కిస్‌ బానో అనే మహిళను అత్యాచారం చేయడంతో పాటు ఆమె కుటుంబాన్ని ఊచ కోత కోశారు కొందరు. అయితే ఈ కేసుకు సంబంధించిన 11 మంది దోషుల విడుదలను సవాల్‌ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిని కలిపి ప్రత్యేక ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో గుజరాత్ ప్రభుత్వ వైఖరిపై సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది. ఈ కేసులో దోషుల మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చారు. అలాంటప్పుడు 14 ఏళ్ల శిక్షాకాలం ముగియగానే వాళ్లను ఎలా విడుదల చేశారు? ఇతర ఖైదీలను అలాంటి ఉపశమనం ఎందుకు ఇవ్వలేకపోయారు? వీళ్లు మాత్రమే సత్‌ప్రవర్తన కనబర్చారా?.. ప్రత్యేకించి ఈ కేసులోనే దోషుల్ని విడుదల చేయడంలో అంతర్యం ఏంటి? అని గుజరాత్‌ ప్రభుత్వాన్ని జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ ఉ‍జ్జల్‌ భుయాన్‌లతో కూడిన బెంచ్‌ ప్రశ్నించింది.

బిల్కిస్ బానో కేసులో దోషులపై సలహా కమిటీని ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేశారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆ కమిటీ వివరాలను తెలియజేయాలని ఆదేశించింది. ఈ కేసు విచారణను గోద్రా కోర్టు నిర్వహించనప్పుడు, దోషుల విడుదల విషయంలో ఆ కోర్టు అభిప్రాయాన్ని ఎందుకు తీసుకున్నారని గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు అడిగింది. అయితే ప్రశ్నలకు వివరణ కష్టతరమని, సుప్రీం కోర్టులో ఇందుకు సంబంధించిన కేసు పెండింగ్‌లో ఉందని గుజరాత్ ప్రభుత్వం అదనపు సోలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు కోర్టుకు తెలిపారు.

అంతే కాదు.. విడుదలైన 11 మంది ముద్దాయిలు చేసింది హేయమైన నేరమే అయినప్పటికీ, అత్యంత అరుదైనది మాత్రం కాదని తెలిపారు ఎస్వీ రాజు . జైలులో ఉన్నప్పుడు చేసిన తప్పును తెలుసుకున్నారని, అందువల్ల సంస్కరించుకోవడానికి వారికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని , ముందస్తుగా విడుదల చేయడాన్ని సమర్థించుకున్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఈ విధానాన్ని 14 ఏళ్ల జైలు శిక్షను పూర్తి చేసుకున్న అందరు ఖైదీలకు వర్తింపజేయకుండా ఎంపిక చేసిన కొందరికి మాత్రమే ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించింది. శిక్ష తగ్గింపుపై రాష్ట్రానికొక విధానం ఉంటుందని, వాటిపై ఉత్పన్నమయ్యే ప్రశ్నలను ఒక రాష్ట్రాన్ని కాకుండా అన్ని రాష్ట్రాలనూ అడగాల్సి ఉంటుందని ఏఎస్‌జీ బదులిచ్చారు. ఇక్కడ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన అందరికీ ఒకే విధానాన్ని అనురిస్తోందా? లేదా? అన్నదే ప్రశ్న అని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.





Tags:    

Similar News