ఈ మధ్య కాలంలో మనుషుల ఆలోచన తీరు మారుతోంది. ఇష్టం లేకుండా కష్టంగా కలిసి ఉండే కన్నా..ఇష్టమైన వారిని పెళ్లాడి కష్టమైనా, నష్టమైనా ఆనందంగా ఉండాలనుకుంటున్నారు. అందుకోసం పెద్దలు కుదిర్చిన పెళ్లిని పెటాకులు చేసుకుని ప్రియుడితో మరో పెళ్లికి రెడీ అవుతున్నారు. ఇలాంటి సంఘటనలు రీసెంట్గా చాలానే జరుగాయి. అయితే తాజాగా ఒడిశాలో మాత్రం ఓ భర్త తన పెద్ద మనసును చాటుకున్నాడు. 1998లో విడుదలైన కన్యాదానం సినిమాలో హీరో శ్రీకాంత్, తన భార్య రచనను ఆమె ప్రియుడు ఉపేంద్రకు ఇచ్చి పెళ్లి చేసినట్లుగానే రియల్ లైఫ్ లో ఓ భర్త తన భార్యకు తాను ప్రేమించిన అబ్బాయితో దగ్గరుండి మరీ పెళ్లి చేశాడు.
ఒడిశాలోని సోన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కిరాసి గ్రామానికి చెందిన మాధవ ప్రధాన్, అనుగుల్కు చెందిన జిల్లిని మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన కొత్తలో వీరి కాపురం సజావుగానే సాగింది. అంతా బాగుంది అని అనుకునేలోపే గత కొంత కాలంగా జిల్లి దూరపు చుట్టమైన పరమేశ్వర ప్రధాన్‌తో సన్నిహితంగా ఉంటోంది. జిల్లి, పరమేశ్వర్లు ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. దీంతో భర్తకు తెలియకుండా ఇంట్లోంచి వెళ్లిపోదామనుకుంది జిల్లి. ఈ నేపథ్యంలోనే గురువారం ఇద్దరూ ప్లాన్ ప్రకారం ఇంటి నుంచి వెళ్లిపోయారు. భార్య ఉన్నట్లుండి కనిపించకపోవడంతో భర్త మాధవ ప్రధాన్ పోలీసులను ఆశ్రయించాడు. భార్య కనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చాడు. అదే విధంగా పరమేశ్వర ప్రధాన్‌తో ఉన్న సంబంధం గురించి పోలీసులకు వివరించాడు. పోలీసులు గాలించి పరమేశ్వర, జిల్లిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. జిల్లిని పొలిసు అధికారి జిల్లిని ప్రశ్నించగా.. పరమేశ్వర్ ప్రధాన్‌తోనే ఉంటానని , అతడినే పెళ్లి చేసుకుంటానని తన నిర్ణయాన్ని చెప్పింది. దీంతో మాధవ ప్రధాన్ ఆలోచించి తన భార్య జిల్లికి పోలీస్ స్టేషన్లోనే మరో పెళ్లి చేశాడు. దీంతో ఈ న్యూస్ స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.