తనతో శారీరక సంబంధానికి నిరాకరించాడని ఓ మహిళ తన భర్తపై క్రిమినల్ కేసు పెట్టింది. ఈ కేసుపై కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ‘భర్త శృంగారానికి దూరంగా ఉండటం హిందూ వివాహ చట్టం ప్రకారం క్రూరమే. అయినప్పటికీ ఐపీసీ సెక్షన్ 498A ప్రకారం నేరం కాద’ని హైకోర్ట్ స్పష్టం చేసింది. 2019లో ఓ జంటకు పెళ్లయ్యింది. వాళ్లిద్దరి మధ్యుండే ప్రేమ.. మనసుకు సంబంధించినదని భావించిన భర్త.. భార్యతో శృంగారానికి నిరాకరించాడు. దీంతో ఆమె తన భర్త, అత్తామామలపై క్రిమినల్ కేసు పెట్టింది. ఆ కేసును న్యాస్థానం కొట్టేసింది. వివరాల్లోకి వెళ్తే..
ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించే భర్త.. భార్యతో శారీరక సంబంధానికి నిరాకరించాడు. దాంతో పెళ్లయ్యాక 28 రోజులపాటే అత్తింట్లో ఉన్న ఆ మహిళ.. పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత 2020 ఫిబ్రవరిలో ఐపీసీ సెక్షన్ 498ఏ, వరకట్నం నిరోధక చట్టం కింద భర్త, అత్తమామలపై కేసు పెట్టింది. అంతేకాకుండా హిందూ వివాహ చట్టం ప్రకారం తన పెళ్లి పరిపూర్ణం కాలేదని, తన వివాహాన్ని రద్దు చేయాలని కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను పరిశీలించిన కుటుంబ న్యాయస్థానం 2022 నవంబర్ లో వీరి వివాహాన్ని రద్దు చేసింది. అయితే భర్త, అత్తామామలపై పెట్టిన క్రిమినల్ కేసుల మాత్రం అలాగే కొనసాగించింది. దీన్ని ఛాలెంజ్ చేస్తూ భర్త.. కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ‘ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న భర్త శృంగారాన్ని నిరాకరించాడు. తన దృష్టిలో ప్రేమ అంటే మనసుల మధ్య కూడా ఉంటుందని భావించాడు. అయితే పెళ్లి చేసుకున్న భార్యతో శృంగారాన్ని నిరాకరించడం హిందూ వివాహ చట్టం ప్రకారం క్రూరత్వం. అయితే ఐపీసీ సెక్షన్ 498ఏ ప్రకారం అది నేరం కిందికి రాదు. అది కాదని భర్తపై క్రిమినల్ చర్యలు చేపడితే అది వేధింపుల కిందికి వస్తుంది. అందుకే ఈ పిటిషన్ ను అంగీకరించి కేసును కొట్టేస్తున్నాం’అని హైకోర్ట్ తీర్పు ఇచ్చింది.