Arvind Kejriwal : నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి.. ఢిల్లీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో పరిపాలన కొనసాగిస్తున్నందుకు తనకు నోబెల్ ప్రైజ్ రావాలన్నారు. ఎన్నో ఆంక్షలు, కుట్రల మధ్య ఢిల్లీలో ప్రభుత్వాన్ని నడుపుతున్నానని..అందుకు తనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని వ్యాఖ్యానించారు. వాటర్ బిల్లులపై ఆప్ కార్యకర్తలు చేపట్టిన నిరసనలో సీఎం పాల్గొన్నారు. పెండింగ్ వాటర్ బిల్లుల అంశంలో అప్ ప్రభుత్వం నిర్ణయాన్ని కేంద్రం అడ్డుకుంటోందని కేజ్రీవాల్ ఆరోపించారు.
పెండింగ్ వాటర్ బిల్లుల విషయంలో వన్ టైం సెటిల్మెంట్ అమలును ఆపాలని బీజేపీ లెఫ్ట్నెంట్ గవర్నర్ను కోరుతుందని కేజ్రీవాల్ అన్నారు. దీనిని అమలు చేసేందుకు అటు అధికారులు కూడా భయపడుతున్నారని చెప్పారు. దీనిని అమలు చేస్తే సస్పెండ్ చేస్తామని బెదిరిస్తున్నట్లు అధికారులు తనతో చెప్పారని ఆరోపించారు. అంతేకాకుండా ఢిల్లీలో స్కూళ్లు, ఆస్పత్రులు నిర్మించకుండా బీజేపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. ఢిల్లీ ప్రజలు మాత్రం తమనే నమ్ముకున్నారని.. కేంద్రం తీరుతో వారికి న్యాయం చేయలేకపోతున్నామని చెప్పారు.