Himanta Biswa Sarma : పాదయాత్రలో రాహుల్ డూప్.. త్వరలో వివరాలు బయటపెడతానన్న సీఎం
రాహుల్ గాంధీ - అసోం సీఎం హిమంత బిశ్వ శర్మకు అస్సలు పడదు. గతంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న హిమంత బీజేపీలో చేరి ప్రస్తుతం అసోం సీఎంగా ఉన్నారు. ఇటీవల అసోంలో రాహుల్ భారత్ న్యాయ్ యాత్ర నిర్వహించారు. అయితే యాత్రలో పలు ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. రాహుల్పై కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం ఈ కేసును అక్కడి పోలీసులు సీఐడీకి అప్పగించారు. అదే సమయంలో సీఎం హిమంత రాహుల్పై సంచలన ఆరోపణలు చేశారు. పాదయాత్రలో రాహుల్కు బదులుగా ఆయన డూప్ పాల్గొంటున్నారని ఆరోపించారు.
తాజాగా ఆ వ్యాఖ్యలపై సీఎం హిమంత మరోసారి స్పందించారు. త్వరలోనే ఆ డూప్ పేరు, వివరాలను బయటపెడతానని తెలిపారు. ‘‘ నేను ఊరికే అనట్లేదు. రెండు రోజులు ఆగండి. ఆ డూప్ ఎవరు, అడ్రస్ ఎక్కడ అనే వివరాలను చెప్తాను’’ అని హిమంత వ్యాఖ్యానించారు. అదేవిధంగా రాహుల్ కచ్చితంగా అరెస్ట్ చేస్తామని సీఎం గతంలోనే అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయన్ని అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు అరెస్ట్ చేస్తే దానిని రాజకీయంగా వాడుకుంటారని.. అందుకే ఎన్నికల తర్వాత అరెస్ట్ చేస్తామని చెప్పారు.