భారీ నుంచి అతి భారీ వర్షాలు.. పలు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక..

Update: 2023-06-19 11:58 GMT

దేశంలోని పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఈశాన్య రాష్ట్రాలతో పాటు బెంగాల్ లో భారీ వానలు పడతాయని అధికారులు ప్రకటించారు. మూడు నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

భారీ నుంచి అతిభారీ వర్షాలు

నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అసోం, సిక్కిం, మేఘాలయాతో పాటు బెంగాల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు వానలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. వీటితో పాటు యూపీ, రాజస్థాన్, నార్త్ గుజరాత్, కేరళ, కర్నాటక, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వానలు పడతాయని చెప్పింది. బీహార్, జార్ఖండ్, ఒడిశా హిమాచల్ ప్రదేశ్ ల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. రుతుపవనాల ప్రభావంతో తమిళనాడుకు అతిభారీ వర్ష సూచన ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.

మరో 5 రోజుల పాటు వానలు

ఇక ఆకస్మిక వరదలతో అల్లాడుతున్న అసోంలో పరిస్థితి ఇంకా దారుణంగానే ఉంది. 14 జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. మరో 5 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. భారీ వరదల కారణంగా ఇప్పటికే వేలాది మంది నిరాశ్రయులయ్యారు. నీటి ఉద్ధృతికి చాలా ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోవడంతో ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జిల్లాలకు రెడ్ అలర్ట్

భారీ వర్షాలు కురుస్తుండటంతో అసోంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. సోమవారం పలు ప్రాంతాల్లో 11 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశముందని హెచ్చరించింది. ముఖ్యంగా లోతట్టు జిల్లాలైన కోక్రాఝార్, చిరాంగ్, బక్సా, బర్పేటా, ధుబ్రీ, కమ్రూప్, నల్బరీ, చాచర్, గోల్పారా, కరీంగంజ్ జిల్లాల్లో భారీ వానలు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 




Tags:    

Similar News