INDIA Alliance Meet : బహిరంగ సభ, సీట్ల పంపకంపై చర్చ

Byline :  Kiran
Update: 2023-09-13 14:42 GMT

బీజేపీపాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో తొలి బహిరంగ సభ నిర్వహించాలని ఇండియా కూటమి నిర్ణయించింది. అక్టోబర్ మొదటివారంలో భోపాల్లో భారీ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఇండియా బ్లాక్‌ కోఆర్డినేషన్‌ కమిటీ తొలి సమావేశంలో నిర్ణయించారు. ఢిల్లీలోని ఎన్సీపీ చీఫ్ శరద్‌ పవార్‌ నివాసంలో ప్యానెల్‌ సమావేశమైంది.

2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటు, తొలి బహిరంగ సభ నిర్వాహణతో పాటు పలు అంశాలపై ‘ఇండియా’ కూటమి సమన్వయ కమిటీ చర్చించినట్లు తెలుస్తోంది. బీజేపీ హయాంలో పెరిగి పోయిన అవినీతి, నిరుద్యోగం, నిత్యావసరాల ధరలు తదితర సమస్యలను ఈ పబ్లిక్ మీటింగ్‌లో ప్రస్తావించనున్నారు. ఎన్నికలకు ఎక్కువ సమయం లేనందున కూటమిలోని పార్టీలన్నీ చర్చించి వీలైనంత తొందరగా సీట్ల పంపకంపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ చెప్పారు.

ఇండియా కూటమి భేటీకి తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఎవరూ హాజరుకాలేదు. వాస్తవానికి ఆ పార్టీ తరఫున లోక్సభ ఎంపీ అభిషేక్ బెనర్జీ సమావేశానికి రావాల్సి ఉంది. అయితే అయితే ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీల భర్తీలో అవకతవకల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరుకావాల్సి ఉండటంతో ఆయన కూటమి భేటీకి రాలేకపోయారు.




Tags:    

Similar News