తీవ్ర తుఫానుగా మారిన తేజ్.. తీరంవైపుగా దూసుకొస్తున్న హమూన్..

Byline :  Kiran
Update: 2023-10-22 11:26 GMT

అరేబియా సముద్రంలో ఏర్పడిన తేజ్ తుఫాను తీవ్ర తుఫానుగా మారింది. ప్రస్తుతం అది యెమెన్ - ఒమన్ తీరాల వైపు పయనిస్తున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. తుఫాను కారణంగా గంటకు 62 కిలోమీటర్ల నుంచి 88 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ ఈదురుగాలులు గంటకు 89 కిలోమీటర్ల నుంచి 117 కిలోమీటర్ల వేగానికి పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.

తేజ్ తుఫాన్ ప్రభావం గుజరాత్‌పై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తుపాన్ తీరం దాటే సమయంలో గంటకు 140 కి.మీ.ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ చెప్పింది.

మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన హమూన్ తుఫాను ఏపీ తీరం వైపు కదులుతోంది. అక్టోబరు 23 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పింది. ఈ తుఫాను మరికొన్ని గంటల్లో ఇది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. తుఫాను ప్రభావంతో కేరళ, తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టం చేశారు. రెండు సైక్లోన్ల ప్రభావంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పారు. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.




Tags:    

Similar News