Ravi River : పాకిస్తాన్కు నీళ్లు బంద్.. చెక్ పెట్టిన భారత్..
భారత్ - పాక్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమంటుంది. ఇండియాను ఎప్పుడు దెబ్బకొట్టాలా అని పాక్ చూస్తుంటుంది. కానీ అది సాధ్యం కాకున్నా దాన్ని ప్రయత్నాలు మాత్రం ఆపదు. ఎప్పుడు భారత్పై విషం చిమ్ముతూనే ఉంటుంది. ఇక ఎన్నో ఏళ్లుగా భారత్కు దక్కాల్సిన నీళ్లు పాక్కు వెళ్తున్నాయి. నాలుగు దశాబ్దాలపై సాగుతున్న ఈ నీటి ప్రవాహానికి భారత్ ఇప్పుడు చెక్ పెట్టింది. అసలు భారత్ ఏం చేసింది.?. పాకిస్థాన్ వెళ్తున్న నీటి ప్రవాహానికి ఎలా చెక్ పెట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం..
సింధూ నది ఉపనది అయిన రావి నది నీళ్లన్నీ ఇకపై భారత్కే దక్కనున్నాయి. గత నాలుగు దశాబ్దాలుగా ఈ నీళ్లు పాకిస్థాన్కు తరలుతున్నాయి. ఇప్పుడు షాపుర్ కంది బ్యారేజ్ పూర్తవడంతో ఈ నీటి ప్రవాహానికి చెక్ పడింది. ఇకపై చుక్క నీరు కూడా పాకిస్థాన్ వెళ్లదు. ప్రస్తుతం ఆ నీటిని జమ్మూలోని కథువా, సాంబా జిల్లాలకు మళ్లించారు. దీంతో 32వేల హెక్టార్లకు సాగునీరు అందనుంది. అంతేకాకుండా జలవిద్యుత్ ఉత్పత్తి చేసి అందులో 20శాతం జమ్మూకశ్మీర్కు ఇవ్వనున్నారు. మన ఇండియాలో ఈ నది 720 కిలోమీటర్ల మేర ప్రయాణించి పాకిస్థాన్ చేరుకుంటుంది.
సింధూ జలాల ఒప్పందం..
భారత్-పాక్ విభజన తర్వాత సింధూ నది జలాలపై ఇరుదేశాల మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం సింధు, చీనాబ్, జీలం నదులు పాక్కు దక్కగా.. బియాస్, రావి, సట్లేజ్ నదులు మనకు దక్కాయి. ఒప్పందంపై అప్పటి ప్రధాని నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సంతకాలు చేశారు. రావి నది జలాలు పాక్ కు వెళ్లకుండా.. ఆనకట్టలు నిర్మించాలని అప్పట్లో భారత్ నిర్ణయించింది. దీన్ని కోసం జమ్మూ-పంజాబ్ రాష్ట్రాల మధ్య 1979లో ఒప్పందమూ జరిగింది. రావి నదికి ఎగువైపు రంజిత్ సాగర్ డ్యామ్, కిందివైపు షాపుర్ కంది బ్యారేజ్ నిర్మించేందుకు రెండు రాష్ట్రాల సీఎంలు సంతకాలు చేశారు.
ఆగిపోయిన ప్రాజెక్ట్
ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. ఇక్కడి నుంచి కథ మరోలా మారింది.1982లో ఈ ప్రాజెక్టులకు ప్రధాని ఇందిరా గాంధీ శంకుస్థాపన చేశారు. 1998 నాటికి ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలి కాని అలా జరగలేదు. అనుకున్నట్లుగా 2001లో రంజిత్ సాగర్ డ్యాం పూర్తైంది. అయితే షాపుర్ కంది బ్యారేజ్ నిర్మాణం మాత్రం ఆగిపోయింది. దీంతో రావి నది నీళ్లు పాకిస్తాన్కు కొనసాగాయి. ఎట్టకేలకు 2008లో ఈ బ్యారేజీని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించగా.. 2013లో నిర్మాణం స్టార్ట్ అయ్యింది. నిర్మాణం అయినా ఏడాదికే మళ్లీ ఈ ప్రాజెక్టు ఆగిపోయింది.
పంజాబ్-జమ్మూకశ్మీర్ రాష్ట్రాల మధ్య వివాదంతో షాపుర్ కంది బ్యారేజీ నిర్మాణం ఆగిపోయింది. దీంతో కథ మళ్లీ మొదటికి రాగా కేంద్రం రంగంలోకి దిగింది. కేంద్రం జోక్యంతో 2018లో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇటీవలే ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తవడంతో పాక్కు వెళ్తున్న నీటి ప్రవాహానికి నాలుగు దశాబ్దాల తర్వాత అడ్డుకట్టపడింది. ప్రస్తుతం నీటిని జమ్మూలోని కథువా, సాంబా జిల్లాలకు తరలిస్తున్నారు. అలాగే విద్యుత్ను సైతం ఉత్పత్తి చేయనున్నారు. ఈ ఉత్పత్తిలో 20శాతం కరెంట్ను జమ్మూకశ్మీర్కు ఇవ్వనున్నారు. దీంతో అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.