భారత్ కెనడా మధ్య ఉద్రిక్తత అంతకంతకూ పెరుగుతోంది. ఖలిస్థానీ ఉగ్రవాది విషయంలో నిరాధార ఆరోపణలు చేసిన కెనడాకు భారత్ గట్టి జవాబు ఇచ్చింది. భారత రాయబారిని బహిష్కరించిన కెనడాకు దెబ్బకు దెబ్బ కొట్టింది. భారత్లో పనిచేస్తున్న కెనడా సీనియర్ దౌత్యవేత్తపై వేటు వేసింది. అయితే బహిష్కరించిన అధికారి పేరు బహిర్గతం చేయని భారత్ ఆయనను 5 రోజుల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.
ఇదిలా ఉంటే భారత్‌లో కెనడా హైకమిషనర్ అయిన కామెరూన్ మెక్‌కేకు కేంద్ర విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. ఉదయం ఆయన ఢిల్లీ సౌత్‌బ్లాక్‌లోని విదేశాంగ శాఖ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఈ క్రమంలోనే భారత్‌లోని సీనియర్ కెనడియన్ డిప్లొమాట్ను బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని విదేశాంగ శాఖ.. కెనడా హైకమిషనర్‌కు చెప్పింది. ఐదు రోజుల్లోగా ఆ దౌత్యవేత్త దేశాన్ని వీడి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. దేశ అంతర్గత వ్యవహారాల్లో కెనడా దౌత్యవేత్తల జోక్యం, భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా ఆ రాయబారిని బహిష్కరించామని విదేశాంగ శాఖ ప్రకటించింది.
ఈ ఏడాది జూన్లో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యాడు. అయితే ఈ ఘటన వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సోమవారం ఆ దేశ పార్లమెంటులో అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ప్రకటన చేసిన కొన్ని గంటలకే కెనడాలో భారత రాయబారిని బహిష్కరిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది.
India expels a senior Canadian Diplomat: https://t.co/TS8LHCUuuY pic.twitter.com/Y0pXq3v1DG
— Arindam Bagchi (@MEAIndia) September 19, 2023