ప్రాజెక్ట్ టైగర్ అంటూ కోట్ల రూపాయలను ఖర్చు పెడుతోంది ఇండియన్ గవర్నమెంట్. ఈపఏడాది ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవమని కూడా చెప్పింది. కానీ 2023 మొదలైన నుంచి ఇప్పటి వరకు 100కు పైగా పులులు చనిపోయాయి. సహజమరణమే కారణమని చెబుతున్నా...కారణాలు ఇంకేమైనా ఉండొచ్చని అనుమానాలు వినబడుతున్నాయి.
నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అధికారిక సమాచారం ప్రకారం... ఈ ఏడాది జూలై 10 వరకు దేశంలో 106 పులులు చనిపోయాయి. ఇందులో జూన్ 30కి ముందే 100 టైగర్లు చనిపోయాయి. వీటిలో ఎక్కువగా మధ్యప్రదేశ్‌లో 27, మహారాష్ట్రలో 21, కేరళలో 19 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వేడుకల కోసం ప్రభుత్వం 300 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌ను కేటాయించింది. మరి పులుల ఇలా చనిపోతోంటే నిధులు అన్నీ ఎక్కడికి వెళుతున్నాయి...అసలే ఏం జరుగుతోంది అంటూ అనుమానాలు తలెత్తుతున్నాయి. 2022లో దేశంలోని అడవిలో 3,167 పులులు ఉంటాయని అంచనా. ఇప్పుడు ఆ సంఖ్య మరింత తగ్గిపోవచ్చును. కొత్త లెక్కలు ప్రకటిస్తే కానీ తెలియదు. మరోవైపు మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో చిరుతలు వరుసగా చనిపోవడం కొత్త ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు 8 చిరుతలు చనిపోగా, వాటిలో 3 పిల్లలు భారతదేశంలోనే జన్మించాయి. ఇప్పుడు పార్కులో 15 చిరుతలు మాత్రమే మిగిలి ఉన్నాయి.
పులుల మరణానికి సరైన కారణం ఎవ్వరూ చెప్పడం లేదు. వేటాడడం వల్లకాదు అన్నీ సహజ మరణాలే అంటున్నారు అధికారులు. పులుల సంఖ్య గణనీయంగా పెరగడం వల్ల, సహజ కారణాల వల్ల ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని మంత్రిత్వ శాఖ చెబుతోంది. ప్రాజెక్ట్ టైగర్‌ను చూస్తున్న అదనపు డైరెక్టర్ జనరల్ ఎస్.పి.యాదవ్ భారతదేశంలోని అడవులలో పులుల వృద్ధి రేటు 6 శాతంగా ఉందని చెబుతున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. సాధారణంగా పులి వయస్సు 10 నుండి 12 సంవత్సరాలు. ఆ కోణంలో పులుల సహజ మరణం దాని నిర్దిష్ట పరిధిలోనే జరుగుతుంది. వేటగాళ్ళు పులుల కోసం వెతుకుతున్నారని కూడా ఆయనే చెబుతున్నారు. పైగా విదేశాలలో పులి శరీర భాగాలకు మంచి డిమాండ్ కూడా ఉంది.
2012 నుంచి దేశంలో ప్రతి ఏడాది సగటున 120 పులులు మరణిస్తున్నాయి. 2021లో అత్యధికంగా 127 పులులు చనిపోయాయి. అయితే, ఈ సంవత్సరం ఇప్పటికే 100 పులుల చనిపోయాయి. లాస్ట్ టూ ఇయర్స్ తో పోలిస్తే ఇది చాలా తొందరగా జరిగినట్టు లెక్క. NTCA డేటా ప్రకారం 2012- 2020 మధ్య మొత్తం 762 పులులు చనిపోయాయి. ఇందులో 417 సహజ కారణాలు, 44 అసహజమైనవి, 193 వేట కారణంగా జరిగాయి. మిగిలిన 108 మరణాలు ఇతర కారణాల వల్ల సంభవించాయి.
2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రాజెక్ట్ టైగర్ కోసం ప్రభుత్వం 300 కోట్లకు పైగా బడ్జెట్‌ను కేటాయించింది. కానీ గత సంవత్సరాల కన్నా ఇది తక్కువే. PIB నివేదిక ప్రకారం...2018-19లో రూ.350 కోట్లు, 2019-20లో రూ.282.57 కోట్లు, 2020-21లో రూ.195 కోట్లు, 2021-22లో రూ.220 కోట్లకు తగ్గింది. 2022-23లో దీని కోసం ప్రభుత్వం రూ.188 కోట్లు కేటాయించింది. ఈకారణం వల్లనే పులుల చనిపోతున్నాయా అన్నదానికి మాత్రం ఆధారం లేదు. కానీ ఇలాగే తగ్గిపోతూ ఉంటే మాత్రం కొన్నాళ్ళకు దేశంలో పులి అంటే బొమ్మను మాత్రమే చూపించే పరిస్థితి వస్తుంది.