India-Canada: వారం రోజుల్లో మీ వాళ్లను తీసుకెళ్లండి.. అక్టోబరు 10 డెడ్‌లైన్

Update: 2023-10-03 07:58 GMT

ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిర్జర్.. హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో చేసిన ప్రకటన రేపిన ప్రకంపనలు.. రెండు దేశాల మధ్య అగాథాన్ని సృష్టించాయి. ఫలితంగా దౌత్యపరమైన ఉద్రిక్తతలు (India-Canada Diplomatic Row) కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో భారత్ లో పనిచేస్తున్న తబ దౌత్య సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాలని కెనడాకు న్యూదిల్లీ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. అక్టోబరు 10లోగా దాదాపు 40 మంది దౌత్య సిబ్బందిని వెనక్కి పిలిపించుకోవాలని ఒట్టావాకు చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ పత్రిక కథనం వెల్లడించింది.

కెనడాలోని భారత దౌత్యసిబ్బంది సంఖ్యతో పోలిస్తే న్యూఢిల్లీలో కెనడా దౌత్య సిబ్బంది సంఖ్య చాలా ఎక్కువగా ఉందని సూచించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. దీంతో ఆ సంఖ్యను సమస్థాయికి తీసుకురావాలని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసినట్లు జాతీయ మీడియా ఓ కథనంలో పేర్కొంది. అక్టోబరు 10లోగా దౌత్యవేత్తలను వెనక్కి తీసుకెళ్లే ప్రక్రియ పూర్తి కావాలని, ఆ తేదీ దాటిన తర్వాత కూడా అదనంగా ఉన్న సిబ్బందికి దౌత్యపరమైన రక్షణను తొలగిస్తామని భారత్‌ హెచ్చరించినట్లు ఆ కథనం సారాంశం. అయితే, ఈ ప్రచారం అటు కెనడా.. ఇటు భారత ప్రభుత్వం నుంచి గానీ ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. కాగా, నిజ్జర్ హత్యపై కెనడా ఆరోపణలను తీవ్రంగా ఖండించిన భారత్‌.. జస్టిన్ ట్రూడో చర్యలపై తీవ్రంగా మండిపడింది. ఉద్రిక్తతల నేపథ్యంలో కెనడా వాసులకు వీసా సర్వీసులను కూడా భారత్‌ నిలిపివేసింది.

ప్రస్తుతం న్యూఢిల్లీలో కెనడాకు చెందిన 61మంది దౌత్యసిబ్బంది ఉన్నారు. అందులో 41 మందిని వెనక్కి పిలిపించుకోవాలని చెప్పినట్లు సమాచారం. అక్టోబర్‌ 10 దాటిన తర్వాత అదనంగా ఉన్న సిబ్బందికి దౌత్యపరమైన రక్షణను కూడా తొలగిస్తామని భారత్‌ హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమాచారంపై కెనడా, భారత్‌ విదేశాంగ శాఖలు స్పందించాల్సి వుంది.

Tags:    

Similar News