Zimbabwe Plane Crash : జింబాబ్వేలో విమాన ప్రమాదం.. భారత వ్యాపారి మృతి..
జింబాబ్వేలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త, ఆయన కుమారుడు సహా ఆరుగురు చనిపోయారు. భారత్‌కు చెందిన హర్‌పాల్ రంధావా జింబాబ్వేలో రియో జిమ్ పేరుతో మైనింగ్ కంపెనీ నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ బంగారం, బొగ్గును ఉత్పత్తి చేయడంతో పాటు నికెల్, రాగి శుద్ధి చేస్తుంది. శుక్రవారం హర్‌పాల్, ఆయన కొడుకు మరో నలుగురు సిబ్బందితో కలిసి జింబాబ్వేలోని హరారే నుంచి మురోవాలోని మైనింగ్ ప్రాంతానికి కంపెనీకి చెందిన సెస్నా 206 ఫ్లైట్లో బయలుదేరారు. విమానం మషావాకు చేరుకున్న తర్వాత టెక్నికల్ ప్రాబ్లెం తలెత్తడంతో కూలిపోయింది.
విమాన ప్రమాద ఘటనను రియో జిమ్ కంపెనీ అధికారికంగా ధ్రువీకరించింది. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రమాదంలో మరణించిన వారి పేర్లను మాత్రం జింబాబ్వే పోలీసులు వెల్లడించలేదు. అయితే హర్‌పాల్ ఫ్రెండ్ అయిన ప్రొడ్యూసర్ హోప్‌వెల్ చినోనో ఆయన మృతిని ధ్రువీకరించాడు.