గత నెలలో అమెరికాలోని చికాగో వీధుల్లో ఆకలితో అలమటిస్తూ, దయనీయ స్థితిలో ఉన్న హైదరాబాద్ మహిళకు అమెరికాలోని ఇండియన్ ఎంబసీ బాసటగా నిలించింది. ఆమెకు వైద్యం అందించి, తిరిగి స్వదేశానికి పంపించేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడిందని భారత దౌత్యవర్గాలు వెల్లడించాయి.
హైదరాబాద్ కు చెందిన సైదా లులు మిన్హాజ్ జైదీ 2021 ఆగస్టులో అమెరికాలోని డెట్రాయిట్‌లోని ట్రిన్ యూనివర్సిటీలో ఇన్ఫర్మేషన్ సైన్స్ లో మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్లింది. కానీ అక్కడికి వెళ్లిన తరువాత ఆమె వస్తువులన్నీ చోరీకి గురయ్యాయి. దీంతో ఆమె డిప్రెషన్ కు గురైంది. ఆకలితో అలమటిస్తూ ధయనీయ స్థితికి వెళ్లిపోయింది. రెండు నెలల నుంచి తల్లితో కూడా టచ్ లో లేదు. ఆమెను తెలంగాణకు చెందిన మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ) అధికార ప్రతినిధి అంజేద్ ఉల్లాఖాన్ గమనించారు. ఆమె గురించి తెలుసుకొని సైదా ప్రస్తుత పరిస్థితిని వెలుగులోకి తీసుకొచ్చారు.ఆమె పరిస్థితి తల్లికి కూడా తెలిసింది. దీంతో తన కూతురును స్వదేశానికి తీసుకురావాలని ఆమె తల్లి సయీదా వహాజ్ ఫాతిమా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కు లేఖ రాసింది. దీంతో ఆయన వెంటనే స్పందించారు. సైదాను భారత్ కు తిరిగి పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయన ఇండియన్ ఎంబసీని కోరారు.
దీనిపై స్పందించిన కాన్సులేట్.. ‘‘మేము సయ్యదా లులు మిన్హజ్ జైదీని కాంటాక్ట్ చేయగలిగాము. ఆమెకు అవసరమైన వైద్యం, భారత్ వెళ్లేందుకు సాయం అందిస్తామని చెప్పాము. ఆమె ఫిట్‌గా ఉన్నారు. భారత్‌లో ఉన్న తల్లితో కూడా ఆమె మాట్లాడారు. మా సాయం స్వీకరించడంపై మిన్హజ్ స్పందించాల్సి ఉంది. ఆమెకు అవసరమైన ఎటువంటి సాయమైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని ట్విటర్లో పేర్కొంది.