Indian Navy : అరేబియా సముద్రంలో ఇండియన్ నేవీ డేరింగ్ ఆపరేషన్..మాములుగా లేదుగా
సోమాలియా సముద్రపు దొంగల బారి నుంచి మరో నౌకను భారత్ విజయవంతంగా కాపాడింది. అరేబియా సముద్రంలో 36 గంటల పాటు డేరింగ్ ఆపరేషన్ చేపట్టిన భారత్...సోమాలియా సముద్రపు దొంగల చెర నుంచి 19 మంది పాకిస్థానీ నావికుల్ని విడిపించింది. భారత్ యుద్ధనౌక ఐఎన్‌ఎస్ సుమిత్రను రంగంలోకి దింపి సముద్రపు దొంగల అంతు చూసినట్లు ఇండియన్ నేవీ తెలిపింది.
సోమవారం సోమాలియా తీరంలో ఇరాన్ జెండాతో ఉన్న అల్ నయీమీ ఫిషింగ్ నౌకను సముద్రపు దొంగలు చుట్టుముట్టారు. అందులోని 19 మంది పాకిస్థానీ నావికుల్ని బంధించారు. దీనిపై సమాచారం అందుకున్న ఇండియా యుద్ధనౌక.. షిప్ ను అడ్డగించి, బందీలను రక్షించారు.
కొద్ది గంటల ముందు కూడా భారత్ ఇదే తరహా సాహసం చేసింది. శనివారం రాత్రి అరేబియా సముద్రంలో ఇరాన్ ఫిషింగ్ బోట్ ఇమాన్‌ను సోమాలియా దొంగలు ఎత్తుకెళ్లారు. కాపాడండి అంటూ ఇమాన్ నుంచి కొందరు ఇండియన్ నేవీకి సిగ్నల్ పంపించారు. వెంటనే రంగంలోకి దిగిన ఐఎన్‌ఎస్ సుమిత్ర, అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ ధ్రువ్ 17 మంది మత్స్యకారులను రక్షించింది.