సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి కోసం భర్త, పిల్లలను వదిలి పాకిస్థాన్ వెళ్లిన మహిళ అంజూ ప్రస్తుతం అక్కడ బాగానే సెటిలైపోయింది. ప్రియుడు నస్రుల్లా సలహాతో మతం మారి ఫాతిమాగా పేరు మార్చుకొని అతనితో మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. అయితే భారత్ లో ఉంటున్న ఆమె కుటుంబం ప్రస్తుతం మాత్రం నానా తంటాలు పడుతోంది. ఆమె కుటుంబానికి ఇబ్బందులు చుట్టుముట్టాయి. అంజూ చేసిన పనికి తొలుత సానుభూతి వ్యక్తం చేసిన వారే ఇప్పుడు అనుమానంగా చూస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన అంజూకు ఇదివరకే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వకుండానే పాక్‌కు వెళ్లింది. ఈ క్రమంలో అంజూ భర్త, సోదరుడు, ఆమె తండ్రి తమ వృత్తి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మీడియా కథనాలు వెల్లడించాయి. అంజూ భర్తను ఆయన పనిచేస్తోన్న సంస్థ ఉద్యోగంలోనే ఉంచినా.. ఎలాంటి పని అప్పగించడం లేదట. ఆయన్ను బెంచ్‌కు పరిమితం చేశారట. ఆయనను ఇంటికే పరిమితం కావాలని, కంపెనీ పేరును బయట పెట్టొద్దని సూచించినట్లు సమాచారం. ఇక ఆమె సోదరుడు ఉద్యోగం కోల్పోయారట.
తండ్రి సంగతి అయితే మరీ ఘోరం.. టైలర్‌గా పనిచేస్తున్న ఆమె తండ్రిని.. చుట్టుపక్కల వారు వ్యతిరేకిస్తున్నారు. ఆయన కుటుంబాన్ని దూరం పెడుతుండటంతో ఆయనకు పని లభించడం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఆమె సరిహద్దులు దాటి వెళ్లడం, అక్కడ ప్రియుడు నస్రుల్లాను పెళ్లాడటం వెనుక అంతర్జాతీయ కుట్ర ఉందేమో తెలుసుకునేందుకు దర్యాప్తునకు ఆదేశించామని ఇటీవల మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఇక ఫాతిమా, నస్రుల్లా జంటకు అక్కడ ఓ రియల్ ఎస్టేట్ సంస్థ యజమాని మొహసీన్ ఖాన్ అబ్బాసీ కొంత భూమి, నగదును బహుమతిగా ఇచ్చాడు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సు అప్పర్ దిర్ జిల్లాలోని ఓ గ్రామంలో వారు నివసిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయాలపై చర్చ నడుస్తోంది. అంజు చేసిన పని వల్ల ఆమె కుటుంబం సభ్యులు బాధపడుతున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇది కరక్టేనా అని ప్రశ్నిస్తున్నారు.