పాక్‌ గగనతలంలోకి దూసుకెళ్లిన ఇండిగో విమానం..

Update: 2023-06-11 16:15 GMT

భారత్కు చెందిన ఇండిగో విమానం పాక్ గగనతలంలోకి దూసుకెళ్లింది. ప్రయాణికులతో అమృత్‌సర్‌ నుంచి అహ్మదాబాద్‌కు వెళ్తున్న ఇండిగో విమానం ప్రతికూల వాతావరణం వల్ల పాకిస్థాన్‌ గగనతలంలోకి వెళ్లింది. దాదాపు 30 నిమిషాలపాటు పాక్‌ ఎయిర్‌ స్పేస్‌లోనే ప్రయాణించింది. ఈ ఘటన ఇవాళ రాత్రి 7.30 సమయంలో జరగ్గా.. రాత్రి 8.01 గంటలకు విమానం తిరిగి భారత్‌కు చేరినట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది.

ఈ విమానం పాక్లోకి వెళ్లిన నేపథ్యంలో అమృత్సర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు అలర్ట్ అయ్యారు. పాకిస్థాన్ అధికారులతో సంప్రదింపులు జరిపారు. దీంతో తమ భూభాగంలోకి వచ్చిన విమానాన్ని కాంటాక్ట్ అయిన పాక్ అధికారులు.. తిరిగి భారత్ వచ్చేందుకు గైడ్ చేశారు. దీంతో ఇండిగో విమానం అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. అయితే ఇది అసాధారణ సంఘటన కాదని అధికారులు చెప్పారు.

వాతావరణం అనుకూలించని పరిస్థితుల్లో విమానం దారి మళ్లేందుకు అంతర్జాతీయంగా అనుమతి ఉంటుదని చెప్పారు. మే 4న మస్కట్‌ నుంచి లాహోర్‌కు వెళ్తున్న పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం భారత్‌ గగనతలంలోకి ప్రవేశించింది. సుమారు 10 నిమిషాల తర్వాత తిరిగి వెళ్లింది. పాకిస్థాన్‌లో బాగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఆ విమానం భారత గగనతలంలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది.


Tags:    

Similar News