రన్ వేను తాకిన తోక భాగం.. ఇండిగో ఫ్లైట్కు తప్పిన పెను ప్రమాదం

Update: 2023-06-13 07:17 GMT



ఢిల్లీలో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఫ్లైట్ రన్ వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో దాని తోక భాగం నేలను తాకింది. పైలెట్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఫ్లైట్ సేఫ్గా ల్యాండైంది. రెండ్రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జూన్ 11న కోల్కతా నుంచి వచ్చిన ఇండిగో వీటీ-ఐఎంజీ ఫ్లైట్ ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్కు సిద్ధమైంది. విమానం రన్ వేపైకి చేరగానే దాని తోక భాగం నేలను తాకింది. దీంతో విమానం స్వల్పంగా కుదుపులకు లోనైంది. పైలెట్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఫ్లైట్ సురక్షితంగా ల్యాండైంది. ఈ ఘటనకు సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది.

‘‘విమానం ల్యాండ్‌ అయ్యేంత వరకు ఏ సమస్యా తలెత్త లేదు. ఫ్లైట్ రన్‌వేను సమీపిస్తుండగా విమానం భిన్నంగా కదులుతున్నట్లు పైలట్లు గుర్తించారు. అలాగే ల్యాండింగ్‌ ప్రక్రియను ప్రారంభించారు. అయితే విమానం దిగే సమయంలో దాని తోకభాగం రన్‌వే నేలను తాకింది’’ అని డీజీసీఏ చెప్పింది. ఈ ఘటనలో విమానం తోక భాగం దెబ్బతింది. దీంతో దాని ఆ ఫ్లైట్ సర్వీసులు నిలిపివేసినట్లు ఇండిగో ప్రకటించింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించిన డీజీసీఏ.. అది పూర్తయ్యే దాకా విమానం నడిపిన పైలట్లను విధుల నుంచి తప్పించినట్లు స్పష్టం చేసింది.




Tags:    

Similar News