విమానయాన చరిత్రలో భారీ డీల్.. 500 ఫ్లైట్లు కొనుగోలు చేయనున్న ఇండిగో..

Update: 2023-06-19 16:28 GMT

దేశ విమానయాన చరిత్రలో అతిపెద్ద డీల్‌ కుదిరింది. డొమెస్టిక్ బడ్జెట్‌ ఎయిర్ లైన్స్ ఇండిగో 500 విమానాల కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్‌ నుంచి నేరో బాడీ విమానాల కొనుగోలుకు డీల్ కుదుర్చుకుంది. ఇటీవలే ఎయిరిండియా ఎయిర్‌బస్‌, బోయింగ్‌తో అతిపెద్ద ఒప్పందం చేసుకుంది. ఎయిరిండియా 470 ఫ్లైట్ల ఆర్డర్‌ చేయగా తాజాగా ఇండిగో దాన్ని అధిగమించి కొత్త రికార్డు సృష్టించింది.

ప్రస్తుతం 300 ఫ్లైట్లు నడుపుతున్న ఇండిగో ఇప్పటికే 480 విమానాల కొనుగోలుకు ఆర్డర్‌ పెట్టింది. అయితే అవి ఇంకా డెలివరీ కాలేదు. ఇదే క్రమంలో 2030 - 2035 మధ్య డెలివరీ కోసం మరో 500 విమానాలకు ఇండిగో ఆర్డర్‌ చేసింది. ఇలా మొత్తంగా ఇండిగో వెయ్యి వరకు ఫ్లైట్లు ఆర్డర్‌ చేసింది. తాజాగా ఆర్డర్‌ చేసిన విమానాల్లో ఏ320 నియో, ఏ321 నియో, ఏ321 XLR ఫ్లైట్లు ఉన్నాయి. ఈ డీల్‌ విలువ దాదాపు 50 బిలియన్‌ డాలర్లు ఉంటుందని అంచనా.

2006లో ప్రారంభమైన ఇండిగో ఇప్పటి వరకు ఎయిర్ బస్ నుంచి 1,330 ఎయిర్ క్రాఫ్ట్ ఆర్డర్ చేసింది. ప్రస్తుతం దేశీయ విమానయాన రంగంలో ఇండిగో వాటా 56 శాతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విమానయాన సంస్థలు సేవల్ని మరింత విస్తృతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో భారీగా కొత్త ఎయిర్ క్రాఫ్ట్ ల కొనుగోలుకు సిద్ధమవుతున్నాయి. ఇదిలా ఉంటే భారీగా ఆర్డర్లు వస్తుండటంతో మానుఫ్యాక్చరింగ్ కంపెనీలు సప్లై విషయంలో ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. 

Tags:    

Similar News