గోవాలో ips అధికారి పాడుపని.. సస్పెండ్ చేసిన కేంద్రం

Update: 2023-08-17 10:02 GMT

ఆయనో ఐపీఎస్ ఆఫీసర్.. పైగా డీఐజీ ర్యాంక్.. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన సదరు అధికారి పాడుపనికి పాల్పడ్డారు. ఈ ఘటన గోవాలో జరిగింది. గోవాలోని ఓ నైట్‌ క్లబ్‌లో మహిళతో ఐపీఎస్ ఆఫీసర్ అసభ్యంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రాగా.. కేంద్రం సదరు అధికారిపై చర్యలు తీసుకుంది.

ఏజీఎంయూటీ కేడర్కు చెందిన 2009 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ కోవన్‌.. గోవాలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఓ నైట్‌ క్లబ్‌లో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా లైంగికంగా వేధించాడనే ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి ఓ వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ అంశాన్ని గోవా ఫార్వర్డ్‌ పార్టీ అసెంబ్లీలో సైతం లేవనెత్తింది.




 


సదరు అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం ప్రమోద్‌ సావంత్‌ అసెంబ్లీలోనే హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై విచారణ జరిపిన రాష్ట్ర సర్కార్ కేంద్ర హోంశాఖకు నివేదిక అందజేసింది. ఈ రిపోర్ట్ ఆధారంగా కేంద్ర హోంశాఖ శాఖాపరమైన చర్యలకు దిగింది. సదరు అధికారిపై తక్షణమే సస్పెన్షన్‌ వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. గోవా పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌కు అటాచ్‌ చేసిన కేంద్రం.. ముందస్తు అనుమతి లేకుండా అక్కడ నుంచి వెళ్లొద్దని ఆదేశించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అతడిని విధుల నుంచి రిలీవ్ చేసింది.


Tags:    

Similar News