MS Dhoni : ఫిక్సింగ్ ఆరోపణల్లో ధోనీకి అనుకూలంగా తీర్పు.. ఐపీఎస్ అధికారికి జైలుశిక్ష

Byline :  Bharath
Update: 2023-12-15 12:56 GMT

ఐపీఎల్ 2013 సీజన్ లో ఫిక్సింగ్, బెట్టింగ్ ఘటనలు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై కూడా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీపై రెండేళ్ల నిషేధం కూడా విధించారు. ఆ సమయంలో ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ నేతృత్వంలో విచారణ జరిగింది. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన సంపత్ కుమార్.. ఐపీఎల్ ఫిక్సింగ్ జరుగుతుందని.. ఇందులో ధోనికి, సీఎస్కే జట్టుకు సంబంధం ఉందని ఆరోపణలు చేశాడు. అంతేకాకుండా న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు. ఈ ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధోనీ.. పరువు నష్టం దావా వేస్తూ మద్రాసు హైకోర్టులో కేసు వేశాడు. తనకు రూ.100 కోట్లు నష్ట పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశాడు.


దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ధోనీని నిర్దోశిగా ప్రకటిస్తూ.. ఇంటర్వ్యూ చేసిన చానల్, అధికారి సంపత్ కుమార్, ఇతరులపై నిషేదం విధించింది. సంపత్ కు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ కేసులో సంపత్ ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందని ధోనీ, మరోసారి కోర్టు మెట్లెక్కాడు. కోర్టు ధిక్కరణ కేసు కింద సంపత్ పై చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్ట్ ను ధోనీ కోరాడు. ఈ విషయంలో మద్రాసు హైకోర్టులో ఇవాళ విచారణ జరగగా.. ఐపీఎస్ అధికారి సంపత్ కు న్యాయస్థానం 15 రోజుల జైలు శిక్ష విధించింది. అయితే అతను అప్పీల్ చేసుకునేందుకు వీలుగా శిక్ష అమలును 30 రోజుల నిలుపుదల చేసింది.






Tags:    

Similar News