రాఖీ పండుగ ఆగస్టు 30నా, 31నా..? పౌర్ణమి ఘడియలు ఎప్పుడు ప్రారంభం
మరికొద్ది రోజుల్లో పవిత్రమైన రాఖీ పండగ రానే వచ్చేస్తోంది. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున హిందువులంతా రాఖీ పండుగను ఘనంగా జరుపుకుంటారు. దీంతో ఈ ఏడాది చెల్లెల్లు, అక్కలు అందరూ తమ ప్రియమైన సోదరులకు రాఖీలు కట్టేందుకు పౌర్ణమి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సంవత్సరం పండగ ఏ రోజు జరుపుకోవాలనే విషయంలో మాత్రం కాస్త గందరగోళం నెలకొంటోంది. ఈ ఏడు పౌర్ణమి ఏ రోజున వచ్చింది..? రాఖీ కట్టేందుకు ముహూర్తం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? ఏ సమయంలో రాఖీ కట్టాలి..? ఆగస్టు 30నా, 31నా అనే పెద్ద సందేహం వచ్చింది. నిజానికి ఈ సంవత్సరం పౌర్ణమి రెండు రోజుల్లో వచ్చింది. దీంతో ఒకరు 30న రాఖీ కట్టాలంటే మరికందరు 31న పండుగ అంటున్నారు. దీంతో ధర్మ సందేహంలో పడిపోయారు సోదరీమణులు. మరి రాఖీ ఎప్పుడు కట్టాలో ముహూర్తం ఎప్పుడు ప్రారంభం అయ్యిందో మనమూ తెలుసుకుందాం పదండి.
సోదరులపై తీవ్ర దుష్ప్రభావం :
ఈ ఏడాది శ్రావణమాసంలో పౌర్ణమి గడియలు ఆగష్టు 30న ఉదయం 10:59 నుండి ఆగష్టు 31 ఉదయం 7:05 వరకు ఉన్నాయి. అయితే 30 తారీఖు ఉదయం 10.59 గంటల నుంచి రాత్రి 9.02 గంటల వరకు భద్ర కాలం ఉండటం వల్ల రాఖీ పండుగను జరుపుకుంటే మంచిది కాదని పంచాంగ కర్తలు చెబుతున్నారు. అందుకే భద్ర కాలం పూర్తైన తరువాతనే రాఖీ పండుగ చేసుకోవాలని అంటున్నారు. అదే అందరికీ శ్రేయస్కరమని పండితుల మాట. అందుకే ఆగస్టు 30నుంచి పౌర్ణమి గడియలు ఉన్నప్పటికీ భద్రకాలం కారణంగా రాత్రి 9 గంటల వరకు రాఖీ పండుగ జరుపుకోకూడదని పండితులు చెబుతున్నారు. ఒకవేళ రాఖీ కట్టితే సోదరులపై తీవ్ర దుష్ప్రభావం పడుతుందని తెలిపారు. అందుకే భద్రకాలంలో రాఖీ కట్టకూడదని సూచిస్తున్నారు.
రాఖీ ఎప్పుడు జరుపుకోవాలి :
హిందూ క్యాలుండర్ ప్రకారం ఆగస్టు 30,31 రెండు తారీఖుల్లో వచ్చింది. కాబట్టి 30వ తేదీన భద్రకాలం పూర్తైన తరువాత అంటే రాత్రి 9.02 గంటల నుంచి 31వ తేదీ ఉదయం 07.05 గంటల వరకు రాఖీ పండుగ చేసుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు. సోదరీమణులు ఈ సమయంలో ఎప్పుడైనా తమ సోదరులకు రాఖీ కట్టవచ్చంటున్నారు. ఈ సమయంలో సోదరులకు రాఖీ కడితే మంచి జరుగుతుందని చెబుతున్నారు. పొరపాటున భద్రకాలంలో రాఖీ కడితే మాత్రం సోదరులకు కష్టాలు, సమస్యలు తప్పవంటున్నారు.