ISRO Aditya-L1 : ఇస్రో మరో చరిత్ర.. ఆదిత్య ఎల్1 ప్రయోగం సంపూర్ణ విజయం
ఇస్రో మరో ఘనత సాధించింది. సూర్యుడి గుట్టు తెలుసుకునేందుకు చేపట్టిన ఆదిత్య ఎల్-1 ప్రయోగం సక్సెస్ అయ్యింది. 127 రోజుల పాటు 15లక్షల కిలోమీటర్లు ప్రయాణించి తన గమ్యానికి చేరుకుంది. ఈ మిషన్లో భాగంగా ఇస్రో ఇవాళ కీలక ఘట్టాన్ని విజయవంతంగా నిర్వహించింది. భూమి నుంచి సూర్యుని దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజియన్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్ష్యలోకి స్పేస్ క్రాఫ్ట్ను పంపించింది. అక్కడి నుంచి సూర్యుడిపై అధ్యయనం చేయనుంది.
ఆదిత్య ఎల్ 1 ఐదేళ్ల పాటు తన సేవలను అందించనుంది. సౌర వాతావరణాన్ని పరిశోధించడం ఈ ఉపగ్రహం లక్ష్యం. భారత్ నుంచి సూర్యుడిని అధ్యయనం చేసే ఇస్రో తొలి మిషన్ ఇదే కావడం విశేషం. భారత్‌కు మాత్రమేకాదు యావత్ ప్రపంచానికి పనికొచ్చే సమాచారాన్ని ఆదిత్య ఎల్1 అందించనుంది. గతేడాది సెప్టెంబర్ 2న శ్రీహరి కోట నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ మొత్తం 7పేలోడ్లను మోసుకెళ్లింది. సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్ వంటి విషయాలపై ఇవి కీలకమైన సమాచారాన్ని అందించనున్నాయి