External Affairs Minister Jaishankar: ఖతార్‌లో ఉరిశిక్ష పడిన వారిని విడిపిస్తాం.. కేంద్ర విదేశాంగ మంత్రి

Update: 2023-10-30 05:41 GMT

ఖతర్(Qatar) దేశం ఎనిమిది మంది భారతీయ మాజీ నేవీ అధికారుల (Ex-Navy Officers)కు గూఢచర్యం ఆరోపణలపై మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఖతర్‌కు చెందిన అల్‌ దహ్రా కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వీరిని గతేడాది ఆగస్టులో రాజధాని దోహాలో అరెస్టు చేశారు. అయితే, వారిపై ఉన్న అభియోగాలను ఇప్పటివరకూ బహిరంగపరచలేదు. పలుమార్లు విచారణ అనంతరం స్థానిక కోర్టు మరణశిక్ష విధిస్తూ తాజాగా తీర్పు ఇచ్చింది.

ఖతార్‌లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న ఆ 8 మంది నౌకాదళ మాజీ అధికారులను విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ (S Jaishankar) తెలిపారు. సోమవారం ఆ బాధిత అధికారుల కుటుంబసభ్యులను కలిసిన ఆయన.. వారికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ విషయాన్ని జైశంకర్‌ తన ట్విటర్‌ ద్వారా తెలిపారు. "ఖతార్‌లో నిర్బంధంలో ఉన్న 8 మంది భారతీయుల కుటుంబాలతో ఈ ఉదయం సమావేశమయ్యాను. ఈ కేసుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపాను. ఆ అధికారుల కుటుంబ సభ్యుల బాధలు, ఆవేదన మాకు తెలుస్తోంది. వారి విడుదలకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలను కొనసాగిస్తుంది. కేసు వివరాలను ఎప్పటికప్పుడు బాధిత అధికారుల కుటుంబసభ్యులకు తెలియజేస్తాం’’ అని రాసుకొచ్చారు.

Tags:    

Similar News