Pawan Kalyan: BJP అభ్యర్థి తరఫున ప్రచారం చేయనున్న జనసేనాని

Byline :  Veerendra Prasad
Update: 2023-11-22 02:40 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తమ పార్టీ అభ్యర్థులతో పాటు బీజేపీ తరఫున ప్రచారాల్లో పాల్గొననున్నారు. నేడు వరంగల్ నగరం హనుమకొండలో జరిగే బీజేపీ (BJP) విజయసంకల్ప సభలో పాల్గొననున్నారు. వరంగల్‌ వెస్ట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రావు పద్మ తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. బీజేపీతో జనసేన పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థుల తరఫున క్యాంపెయిన్ చేయనున్నారు పవన్ .

ఎన్నికల్లో బీజేపీతో ఒప్పందం కుదుర్చుకున్న జనసేన.. తెలంగాణలో 8 స్థానాల్లో పోటీ చేస్తోంది. 111 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీకి మద్దతు ఇచ్చింది. ఈ క్రమంలో ఇరు పార్టీల అగ్ర నాయకులు తమ అభ్యర్థుల తరపున విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. జనసేన తరఫున పవన్​ ఇప్పటి వరకు ఎలాంటి ప్రచారంలోనూ పాల్గొనలేదు. రాష్ట్రంలో తొలిసారిగా ప్రచారం చేయనుండటంతో పవన్ కల్యాణ్ ఏం మాట్లాడతారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. తన ప్రసంగాల్లో తెలంగాణ ఉద్యమాన్ని, నేతల పోరాటాన్ని విరివిగా ప్రస్తావించే పవన్.. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్​లపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు, తమ అభ్యర్థుల గెలుపు కోసం పవన్ ఓటర్లను ఎలా ఆకట్టుకుంటారని జనసేన, బీజేపీ శ్రేణులతో పాటు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

జనసేనాని రాక సందర్భంగా బీజేపీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం హంటర్‌రోడ్డు ఫ్లైఓవర్‌ బ్రిడ్జి సమీపంలో బహిరంగసభ కోసం ప్రైవేటు స్థలాన్ని ఎంపిక చేశారు. మంగళవారం వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం ఇన్‌ఛార్జి మురళీధర్‌గౌడ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శులు కొలను సంతోష్‌రెడ్డి, దేశిని సదానందంతో పాటు పలువురు నాయకులు సభాస్థలాన్ని సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. 


 


Tags:    

Similar News