అలనాడు అగ్రతారలుగా పేరొందిన నటీమణులు సినిమాలు వదిలి.. పాలిటిక్స్ కే అంకితం అయ్యారు. ఏళ్లుగా పార్టీల అభివృద్ధికి పనిచేశారు. జనాల్లో చైతన్యం నింపి పార్టీని బలోపేతం చేశారు. టికెట్ ఆశించి ప్రజా సేవ చేయాలని భావిస్తే.. వారి చెవిలో కమలం పువ్వు పెట్టింది. ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి చివరికి హ్యాండ్ ఇచ్చింది. వారెవరో కాదు జయసుధ, విజయ శాంతి, జీవితా రాజశేఖర్. టికెట్ ఆశించి దరఖాస్తు చేసుకున్నా కూడా బీజేపీ చివరికి నిరాశే మిగిల్చింది. రెండు, మూడో లిస్ట్ లో అయినా టికెట్ వస్తుందని అనుకుని చివరి క్షణం వరకు వెయిట్ చేసినా జాబితాలో పేరు కనిపించలేదు. దాంతో పార్టీకి, రాష్ట్ర నాయకత్వానికి దూరంగా ఉంటూ.. ఎలాంటి కార్యకలాపాల్లోనూ కనిపించడం లేదు.
ఇక విజయశాంతి ఎప్పటినుంచో బీజేపీలో ఉన్నా.. ఆమెతో అంటి ముట్టనట్లు ఉంటున్నారు రాష్ట్ర నాయకులు. పార్టీలో ప్రాధాన్యం తగ్గడం, రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ అమాంతంగా పడిపోవడంతో పోటీ చేసినా ప్రయోజనం ఉండదని విజయశాంతి భావిస్తున్నట్లు తెలుస్తుంది. వీరితో పాటు బీజేపీలో ఉన్న చాలా మంది మహిళల పరిస్థితి ఇలానే ఉంది. సికింద్రాబాద్ టికెట్ వస్తుందని మాజీ మేయర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బండ కార్తీకారెడ్డి ఆశించారు. ఆమె సహా మరో నలుగురు మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. జూబ్లీహిల్స్ సీటు కోసం పద్మ, కీర్తి, జీవితా రాజశేఖర్ పోటీ పడగా.. వారిని కాదని దీపక్ రెడ్డికి టికెట్ కట్టబెట్టారు. అంబర్‌పేట్ టికెట్ ఆశించిన మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి పరిస్థితి ఇదే. సనత్‌నగర్ సీటును ఆకుల విజయ కోరగా ఆమెకు నిరాశే మిగిలింది. దీంతో మహిళలకు బీజేపీ అన్యాయం చేసిందని విమర్శలు వస్తున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ వారంతా పార్టీ మారే యోచనలో ఉన్నట్టు సమాచారం. బీజేపీ మహిళలకు అన్యాయం చేస్తుందని మండిపడుతున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే బీజేపీ మహిళలకు ప్రాధాన్యం ఇవ్వట్లేదని అర్థం అవుతుంది.