10 రోజుల్లో బలనిరూపణ.. హైదరాబాద్కు జార్ఖండ్ ఎమ్మెల్యేలు..

By :  Kiran
Update: 2024-02-02 10:59 GMT

జార్ఖండ్ రాజకీయం హైదరాబాద్కు చేరింది. కొత్త సర్కారు ఏర్పడిన వెంటనే రిసార్టు రాజకీయాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో అధికార జేఎంఎం - కాంగ్రెస్ కూటమికి చెందిన ఎమ్మెల్యేలంతా హైదరాబాద్కు చేరుకున్నారు. రెండు ప్రత్యేక విమానాల్లో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న వారికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, కేసీ వేణుగోపాల్, మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతం పలికారు. బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి ఎమ్మెల్యేలను శామీర్ పేటలోని ఓ రిసార్టుకు తరలించారు.

జార్ఖండ్లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రస్తుతం జేఎంఎంకు 29 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. కాంగ్రెస్ కు 17, ఎన్సీపీ, ఆర్జేడీ, సీపీఐఎంల్ కు చెరొక ఎమ్మెల్యే చొప్పున ఉన్నారు. ఇక బీజేపీ బలం 26 కాగా, ఏజేఎస్యూకు 3, ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు. జేఎంఎం, కాంగ్రెస్, ఎన్సీపీ, ఆర్జేడీ, సీపీఐఎంల్ కూటమికి 49 మంది సభ్యులు ఉండగా.. ప్రతిపక్ష పార్టీలకు 31 మంది సభ్యుల బలం ఉంది. అయితే డిసెంబర్ 31న మనీలాండరింగ్ స్కాంలో హేమంత్ సోరెన్ అరెస్ట్ కావడంతో జార్ఖండ్లో రాజకీయం హీటెక్కింది. నాటకీయ పరిణామాల మధ్య చంపై సోరెన్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

జార్ఖండ్ లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం 10 రోజుల్లో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆదేశించారు. ఈ క్రమంలో తమ ఎమ్మెల్యేలకు ఇతర పార్టీలు గాలం వేయకుండా జేఎంఎం - కాంగ్రెస్ పార్టీలు అప్రమత్తమయ్యాయి. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా తమ కూటమి ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్ కు తరలించారు. సభలో బల నిరూపణ జరిగే రోజు వరకు వారంతా హైదరాబాద్ లోనే ఉండనున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఈ ఎమ్మెల్యేల కో ఆర్డినేషన్ బాధ్యతను పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్కు అప్పగించింది.




Tags:    

Similar News