Jharkhand: హైదరాబాద్ నుండి రాంచీకి వెళ్లిన జార్ఖండ్ ఎమ్మెల్యేలు
జార్ఖండ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి సోమవారం తెరపడనుంది. భూకుంభకోణం కేసులో మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్టు కాగా... గత శుక్రవారం చంపై సొరెన్ ఆ రాష్ట్ర సీఎంగా ప్రమాణం చేశారు. అయితే రాజకీయ పరిణామాల నేపథ్యంలో జేఎంఎం, కాంగ్రెస్‌లకు చెందిన ఎమ్మెల్యేలను బీజేపీ ఎక్కడ తమవైపు తిప్పుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎక్కడ కూలదోస్తుందో అన్న అనుమానంతో వారిని కాపాడుకునేందకు హైదరాబాద్‌కు పంపించింది అధికార కూటమి. మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోని ఓ రిసార్టులో ఉన్న దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు కాసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి రాంచీకి వెళ్లారు. వీరంతా సోమవారం జార్ఖండ్ అసెంబ్లీలో జరిగే బలపరీక్షకు హాజరై చంపై సోరెన్‌కు తమ మద్దతును ప్రకటించనున్నారు. సోమ, మంగళవారాల్లో అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా, తొలిరోజే విశ్వాసపరీక్షను ఎదుర్కోవాలని చంపై సోరెన్ సర్కారు నిర్ణయించింది.
జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 మంది ఎమ్మెల్యేలు ఉంటే అధికార జేఎంఎం-కాంగ్రెస్ కూటమికి 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మెజారిటీ మార్క్ 41, అయితే, 43 మంది ఎమ్మెల్యేల మద్దతు చంపై సొరెన్‌కి ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు, ఏజేఎస్‌యూ లేదా ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌కు ముగ్గురు ఉన్నారు. ఎన్సీపీ, ఒక లెఫ్ట్ పార్టీకి ఒక్కొక్కరు, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు.
భూ కుంభకోణం కేసులో గత బుధవారం అరెస్టయిన జేఎంఎం చీఫ్, మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాష్ట్ర అసెంబ్లీలో జరిగే విశ్వాస పరీక్షలో పాల్గొనేందుకు రాంచీలోని ప్రత్యేక కోర్టు ఇప్పటికే అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన కూడా సోమవారం అసెంబ్లీ సెషన్లో పాల్గొననున్నారు. హేమంత్ సోరెన్‌కు ఇటీవల సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఆదేశాల మేరకు కుట్రపూరితంగా తనను అరెస్టు చేశారని.. తన అరెస్టును చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని హేమంత్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తాము ఈ అంశంలో జోక్యం చేసుకోబోమని, రాష్ట్ర హైకోర్టుకే వెళ్లాలని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.