మణిపూర్ ఘర్షణలపై రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో దర్యాప్తు కమిటీ

Update: 2023-06-01 09:59 GMT

మణిపూర్‌లో చెలరేగిన హింసపై రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలోని కమిటీ విచారణ నిర్వహించనుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ఈ అల్లర్ల వెనుక ఉన్న కుట్రలపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కూడా విచారణ చేపడుతుందని చెప్పారు. దీంతో పాటు మణిపూర్‌ గవర్నర్​ అధ్యక్షతన ముఖ్యమంత్రి సహా అన్ని పార్టీలు, ఇరు తెగల సభ్యులతో శాంతి కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

మణిపూర్‌లో నాలుగు రోజుల పర్యటన ముగించుకున్న అమిత్ షా.. కాసేపటి క్రితం ఇంఫాల్‌లో మీడియాతో మాట్లాడారు. మరో వైపు మణిపూర్‌లో జరిగిన హింసపై సీబీఐ విచారించనుందన్నారు. ఈ హింస వెనుక కారణాలను బయటకు తీసుకువస్తామన్నారు. విచారణ పారదర్శకంగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. భద్రతా సిబ్బంది నుండి ఆయుధాలను దోచుకున్న వారు తిరిగి అప్పగించాలని.. లేదంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గత నెలలో మణిపూర్‌లో కొన్ని హింసాత్మక ఘటనలు నమోదయ్యాయన్నారు. ఈ ఘటనల్లో మరణించిన కుటుంబాలకు అమిత్ షా సంతాపం తెలిపారు. రాష్ట్రంలోని ఇంఫాల్ , మోరేతో సహా పలు ప్రాంతాల్లో పర్యటించిన విషయాన్ని అమిత్ షా గుర్తు చేశారు.

హింసకు సంబంధించిన ఆరు కేసులను సీబీఐ విచారించనుంది. దర్యాప్తు తటస్థంగా ఉంటుందని మరియు హింస వెనుక ఉన్న కారణాల మూలాల్లోకి వెళుతుందని అమిత్‌ షా తెలిపారు. హింసలో మరణించిన వారి కుటుంబాలకు మణిపూర్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కలిపి రూ. 10 లక్షల పరిహారాన్ని అందజేస్తాయని షా చెప్పారు. కోర్టు తీర్పు కారణంగా, కొంత అపార్థం చేసుకోవడం వల్ల మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని.. మణిపుర్‌ ప్రజలు సహృద్భావంతో చర్చలు జరిపి ఈ పరిస్థితిని సాధారణ స్థితికి తెస్తారని తాము విశ్వసిస్తున్నట్లు చెప్పారు. "మేము "సూ" గ్రూపు వారికి కఠిన హెచ్చరిక జారీచేస్తున్నాం. సూ ఒప్పందాన్ని ఏ రకంగానైనా ఉల్లంఘించినా, ఒప్పందం నుంచి తప్పుకున్నా నిబంధనలు ఉల్లఘించినట్లే. ఒప్పందంలోని అన్ని నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ఈ అంశాన్ని మేము కఠినంగా పర్యవేక్షిస్తాం" అని అన్నారు అమిత్ షా.


Tags:    

Similar News