ఏపీలోని అంబేద్కర్ విగ్రహాలన్నీ బాధపడుతున్నాయ్ : Raghavendra Rao
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు స్పందించారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు అప్రజాస్వామికంగా ఉందన్నారు. ఒక విజన్ లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసే విధానం ఇదేనా అని ప్రశ్నించారు. బాబును అరెస్ట్ చేసిన విధానం చూసి ఏపీలోని అంబేద్కర్ విగ్రహాలన్నీ బాధపడుతాయని అన్నారు.
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రమంతటా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. చంద్రబాబును విజయవాడకు తరలిస్తున్న రోడ్లపై టీడీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి. సాయంత్రం విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబును ప్రవేశపెట్టనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన్ను ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లు చెప్పారు. ఈ కేసులో ఆయనపై ఆరోపణలు నిరూపితమైతే పదేళ్ల వరకూ జైలు శిక్ష పడవచ్చని తెలిపారు.
మరోవైపు చంద్రబాబు అరెస్ట్పై ఆయన సతీమని నారా భువనేశ్వరి స్పందించారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజల కోసమే పోరాటం చేస్తున్నారని చెప్పారు. విజయవాడ కనకదుర్గమ్మను ఆమె దర్శించుకున్నారు. తన భర్తకు మనోధైర్యం ఇవ్వాలని దుర్గమ్మను వేడుకున్నట్లు చెప్పారు. ‘‘చంద్రబాబు రాష్ట్ర ప్రజల బాగు కోసం పోరాటం చేస్తున్నారు. ఎవరికైనా మనసు బాగాలేనప్పుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్తారు. అందుకే నా బాధ చెప్పుకోవడానికి అమ్మవారి దగ్గరకు వచ్చా. అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా ఏకమవ్వాలి’’ అని భువనేశ్వరి అన్నారు.