కర్నాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌లో పేలుడు చోటుచేసుకుంది. నగరంలోని కుండలహళ్లిలో ఉన్న ఈ కేఫ్‌లో శుక్రవారం మధ్యాహ్నాం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో తొమ్మిదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులంతా కేఫ్‌లో సిబ్బందేనని పోలీసులు తేల్చారు. కాగా పేలుడుపై కర్నాటక సీఎం సిద్ధ రామయ్య స్పందించారు. పేలుడుకు కారణం బాంబేనని తేల్చారు. కేఫ్ కు వచ్చిన గుర్తు తెలియన వ్యక్తి బాంబు ఉన్న బ్యాగును వదిలి వెళ్లాడు. సీసీటీవీ ఫుటేజి ద్వారా దీన్ని గుర్తించారు పోలీసులు. తక్కువ తీవ్రత ఉండే ఐఈడీ బాంబు పేలుడు జరిపినట్లు ధృవీకరించారు. దీనిపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నట్లు సీఎం తెలిపారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు కేఫ్ నుంచి పేలుడు జరిగింది. పేలుడు జరగ్గానే అక్కడున్న కస్టమర్లంతా భయంతో బయటకు పరుగులు తీశారు. రామేశ్వరం కేఫ్‌కు ప్రతిరోజు వందల మంది కస్టమర్లు వస్తుంటారు. పేలుడు తర్వాత ఆ కేఫ్ బయట జనాలు పెద్ద ఎత్తున గుమిగూడారు.