స్విగ్గీ, జొమాటో వర్కర్లకు శుభవార్త..ఇకపై వారికి రూ.4 లక్షల బీమా
కర్ణాటక ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. స్విగ్గీ , జొమాటో వంటి సంస్థల్లో పని చేసే గిగ్ వర్కర్లకు బీమా అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధారామయ్య నేతృత్వంలో జరిగిన 2023-2024 ఆర్థిక బడ్జెట్ ప్రసంగంలో రూ.4 లక్షల బీమాను అందిస్తున్నట్లు ప్రకటించారు. గిగ్ వర్కర్లు అంటే బుకింగ్‌పై పని చేసేవారు. ఇకపై స్విగ్గీ, స్విగ్గీ, జొమాటో, అమెజాన్ వంటి సంస్థల్లో పనిచేసే గిగ్ వర్కర్లకు రూ.4 లక్షల బీమాను సర్కార్ అందించనుంది. ఇందులో రూ.2 లక్షలు జీవిత బీమా కాగా.. మరో రూ.2 లక్షలు ప్రమాద బీమా.
కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎంగా, ఫైనాన్స్ మినిస్టర్‌గా, రెండు బాధ్యతలను నిర్వహిస్తున్నారు సిద్ధరామయ్య. ఎన్నికల ప్రచారంలో మహిళలకు ఉచిత ట్రాన్స్పోర్ట్ , దారిద్ర్య రేఖకు కిందున్న కుటుంబంలోని ప్రతి సభ్యుడికి 10 కిలోల బియ్యం, ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, కుటుంబంలోని మహిళకు ప్రతి నెలా రూ.2 వేల ఆర్థిక సాయంతో పాటు , నిరుద్యోగులకు రూ.3 వేలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలను అధికారం చేపట్టిన కొన్ని గంటలకే అమలు చేశారు. తాజా బడ్జెట్‌లో రూ.52 వేల కోట్లను అందుకోసం కేటాయించారు. ఈ ఐదు పథకాల ద్వారా 1.3 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుందని ముఖ్యమంత్రి తెలిపారు.