జాతీయ విద్యావిధానం రద్దు.. సీఎం సంచలన నిర్ణయం

Update: 2023-08-16 02:41 GMT

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యావ్యవస్థను కాషాయీకరీస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో ఓ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ రాష్ట్రంలో ఇకపై జాతీయ విద్యావిధానాన్ని అమలు చేయబోమని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. మంగళవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన గత బీజేపీ ప్రభుత్వ విధానాలను సమీక్షించారు. జాతీయవాదం పేరుతో గత బీజేపీ ప్రభుత్వం విద్యావ్యవస్థను కాషాయీకరిస్తూ సిలబస్‌లో మార్పుచేర్పులు చేసిందని కాంగ్రెస్ భావిస్తోంది. దాన్ని సరిదిద్దేందుకు వీలుగా విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాల్సి ఉందని సీఎం చెప్పారు. బీజేపీ రాజ్యాంగానికి వ్యతిరేకమని, మనువాదాన్ని రుద్దాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. జాతీయ విద్యావిధానాన్ని ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా వ్యతిరేకిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

‘‘గతంలో బీజేపీ పాలనలోని రాష్ట్రాల్లోనూ అమలుకాని విద్యావిధానాన్ని కర్నాటకలో అమలు చేశారు. మన విద్యార్థుల భవిష్యత్తుకు ఆటంకం కల్పించారు. మనకు మనువాద భావజాలపు ఈ విద్యావిధానం అక్కర్లేదు. రాజ్యాంగ విలువలతో కూడిన విద్యావిధానం కావాలి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్ర అవసరాల కోసం కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తాం. ఈ ఏడాది నుంచే అమలు చేయాలనుకున్నా ఎన్నికలు రావడంతో సాధ్యం కాలేదు. అన్ని ఏర్పాట్లూ చేసుకుని జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేస్తాం’’ అని సిద్ధరామయ్య చెప్పారు.

Tags:    

Similar News