కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఐదు ఉచిత హామీలు దోహదపడ్డాయి. వాటిలో అన్నభాగ్య పథకం ఒకటి. అన్నభాగ్య పథకాన్ని జులై 1 నుంచి ప్రారంభించాలని సిద్ధారామయ్య ప్రభుత్వం భావించింది. ఈ పథకం కింద బీపీఎల్ కుటుంబ సభ్యులకు నెలకు 10 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. అయితే ఆదిలోనే అన్నభాగ్య పథకం అమలుకు ఇబ్బందులు ఎదురవతున్నాయి.
అన్నభాగ్య పథకానికి అవసరమైన బియ్యం సేకరణ కష్టంగా మారింది. దీంతో కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత బియ్యానికి బదులుగా నగదు ఇస్తామని ప్రకటించింది. కిలో బియ్యానికి రూ.34 చొప్పున ఐదు కిలోల బియ్యానికి సమానమైన డబ్బును బీపీఎల్ ఖాతాదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలిపింది. ఒక రేషన్ కార్డులో ఒక వ్యక్తి ఉంటే నెలకు రూ.170 వస్తాయి. అదే ఇద్దరు వ్యక్తులైతే రూ.340, ఐదుగురు కుటుంబసభ్యులుంటే నెలకు రూ.850 జమ చేస్తాం అని మంత్రి వివరించారు.
అన్నభాగ్య పథకం అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇవ్వలేదంటూ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం నుంచి బియ్యం రాకపోవడంతో తెలంగాణ, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తోంది.