RTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. షరతులు వర్తిస్తాయి

Update: 2023-06-06 03:56 GMT

తాము అధికారంలోకి వస్తే .. రాష్ట్రంలోని మహిళలంతా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చిన కర్ణాటక కాంగ్రెస్ సర్కార్​.. ఆ మాట నిలబెట్టుకుంది. సోమవారం అందుకు సంబంధించిన హామీని అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శక్తి పథకం పేరుతో ఈ నెల(జూన్​) 11వ తేదీ నుంచి కొన్ని షరతులతో ఈ పథకం అమల్లోకి రానుంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. లబ్ధిదారులు కర్ణాటకకు చెందిన వారై ఉండాలి. మహిళలతో పాటు ట్రాన్స్​జెండర్లకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. రాష్ట్రంలో తిరిగే బస్సులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అంతర్​రాష్ట్ర బస్సులకు ఈ శక్తి పథకం వర్తించదు. రాజహంస, నాన్-ఏసీ స్లీపర్, వజ్ర, వాయు వజ్ర, ఐరావత్, ఐరావత్ క్లబ్ క్లాస్, ఐరావత్ గోల్డ్ క్లాస్, అంబారీ, అంబారీ డ్రీమ్ క్లాస్, అంబారీ ఉత్సవ్ ఫ్లై బస్, ఈవీ పవర్ ప్లస్ వంటి అన్ని లగ్జరీ బస్సులను పథకం నుంచి మినహాయించారు.



బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC), కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (KSRTC), నార్త్ వెస్ట్ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NWKRTC), కల్యాణ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (KKRTC) పరిధిలో నడుపుతున్న బస్సుల్లో ఈ శక్తి పథకం ప్రయోజనాలను పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది. BMTC కాకుండా మిగతా మూడు ఆర్టీసీలకు సంబంధించిన బస్సుల్లో పురుషులకు 50 శాతం సీట్లు రిజర్వ్​​ చేస్తారు.

Tags:    

Similar News