'మధ్యాహ్న భోజనం'లో నా కూతురికి గుడ్డు తినిపించారు.. తండ్రి ఫిర్యాదు

Update: 2023-11-24 04:04 GMT

ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న తన కూతురికి.. 'మధ్యాహ్న భోజనం'లో బలవంతంగా గుడ్లు తినిపించారని ఓ తండ్రి విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. శాకాహారం మాత్రమే తినే తమ కుటుంబం.. కూతురికి బలవంతంగా గుడ్లు తినిపించడం ద్వారా తమ మనోభావాల్ని దెబ్బతీసినట్లయిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ చర్యకు పాల్పడిన పాఠశాల ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. కర్ణాటకలోని శివమొగ్గలో ఈ ఘటన చోటుచేసుకుంది. చిన్నారి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విద్యాశాఖ అధికారులు.. ఈ అంశంపై విచారణకు ఆదేశించారు.

ప్రాథమిక విచారణలో ఓ సీనియర్‌ అధికారి దీనిగురించి మాట్లాడుతూ... ‘‘విద్యార్థులంతా కలిసి మధ్యాహ్న భోజనానికి వరుసలో కూర్చున్నారు. అప్పుడే సంబంధిత ఉపాధ్యాయుడు గుడ్లు కావాల్సిన వారిని చేతులు ఎత్తాలని అడిగారు. ఈ చిన్నారి కూడా మిగిలిన విద్యార్థులతో కలిసి చేతులు ఎత్తినట్లు కనబడింది. దీంతో ఆమెకు గుడ్డు అందించారు. అంతేగానీ, ప్రత్యేకంగా ఈ చిన్నారితో పాటు ఎవరికీ గుడ్లు తినాలని బలవంత పెట్టలేదు’’ అని వివరించారు.

ఇదే అంశంపై శివమొగ్గ పబ్లిక్‌ ఇన్‌స్ట్రక్షన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ సీఆర్‌ పరమేశ్వరప్ప స్పందిస్తూ.. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. కాకపోతే, తమకు వచ్చిన సమాచారం ఆధారంగా ఆ చిన్నారికి బలవంతంగా గుడ్డు వడ్డించలేదన్నారు. బ్లాక్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ ఇచ్చిన నివేదికను పరిశీలించి.. ఏదైనా ఉల్లంఘనకు పాల్పడినట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు




Tags:    

Similar News