Minister KN Rajanna: ప్రజలను మోసం చేయడమే బీజేపీ పనిగా పెట్టుకుంది.. కర్ణాటక మంత్రి

Byline :  Veerendra Prasad
Update: 2024-01-17 01:57 GMT

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంపై పలువురు విపక్ష నేతలు కీలక కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని బీజేపీ-ఆర్ఎస్ఎస్ ప్రాజెక్ట్‌గా విమర్శిస్తూ.. కాంగ్రెస్ అగ్రనేతలు ఆలయ కమిటీ ఆహ్వానాన్ని సైతం తిరస్కరించారు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ నేత, మంత్రి రాజన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రెండు బొమ్మల్ని టెంటులో ఉంచి వాటినే రాముడిగా కొలవాలి అంటున్నారంటూ వివాదానికి తెర తీశారు. కర్ణాటక సమచార శాఖ మంత్రిగా పని చేస్తున్న రాజన్న..బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత తాను అయోధ్యలో పర్యటించిన విషయాన్ని తాజాగా గుర్తు చేశారు.

బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. "రాముడి పేరుతో బీజేపీ ప్రజలందరినీ పిచ్చి వాళ్లని చేస్తుంది.బాబ్రీ మసీదు కూల్చివేసిన తరువాత తాను అయోధ్యకి వెళ్లినట్లు వివరించారు. రెండు బొమ్మలను టెంటులో పెట్టి రాముడు అంటున్నారు. రామ మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అధ్యాత్మికమైన అనుభూతి కలుగుతుంది. కానీ నాకు అయోధ్యలో అలాంటిదేమీ అనిపించలేదు. అక్కడ టూరింగ్ టాకీస్‌లోని బొమ్మలలా అనిపించాయి" అని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామ మందిరాన్ని ఇతర రామాలయాలతో వర్ణిస్తూ..అయోధ్య రామ మందిరం ఏమి అంత పవిత్రమైనది కాదని అన్నారు. ఎన్నో వేల ఏళ్ల చరిత్ర కలిగిన రామాలయాలు భారత్‌‌లో చాలా ఉన్నాయని.. పుణ్యక్షేత్రాలను, దేవాలయాలను బీజేపీ విస్మరిస్తోందన్నారు. ప్రజలను మోసం చేయడమే బీజేపీ పనిగా పెట్టుకుందని మండిపడ్డారు.




Tags:    

Similar News