మరోసారి బయటపడ్డ గవర్నర్, సీఎం మధ్య విభేధాలు.. అసెంబ్లీ సాక్షిగా..
కేరళలో అధికార ఎల్డీఎఫ్, రాష్ట్ర గవర్నర్ల మధ్య విభేదాలు అసెంబ్లీ సాక్షిగా మరోసారి బయటపడ్డాయి. కేరళ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభం కాగా.. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ సంప్రదాయం ప్రకారం సభను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే గవర్నర్ తన స్పీచ్ ను కేవలం 2 నిమిషాల్లోనే ముగించడం హాట్ టాపిక్గా మారింది.
ఉదయం 9 గంటలకు అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్ ఆరిఫ్ ఖాన్ కు సీఎం పినరయి విజయన్, స్పీకర్ స్వాగతం పలికారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగం మొదలుపెట్టారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ ప్రతిలో కేవలం చివరి పేరాను మాత్రమే చదివిన ఆరిఫ్ మహ్మద్ కేవలం 75 సెకండ్లలో స్పీచ్ ముగించి సభ నుంచి వెళ్లిపోయారు. వాస్తవానికి గవర్నర్ ఆరిఫ్ ఖాన్ కు ప్రభుత్వం 62 పేజీల ప్రసంగం అందజేసింది. అయితే దాన్ని చదివేందుకు ఇష్టపడని ఆయన.. కేవలం 75 సెకన్లు మాత్రమే మాట్లాడారు. 9.02 గంటల్లోపు ప్రసంగం ముగించిన ఆయన.. ఉదయం 9.04 గంటలకు సభ నుంచి వెళ్లిపోయారు. కనీసం సీఎంకు షేక్‌హ్యాండ్ కూడా ఇవ్వకపోవడం గమనార్హం.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగిన ఈ ఘటన కేరళ సీఎం, గవర్నర్కు మధ్య విభేదాలను మరోసారి బహిర్గతం చేసింది. ప్రభుత్వం పంపే బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడం, యూనివర్సిటీ నియామకాల్లో ప్రభుత్వ జోక్యం తదితర అంశాలపై ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల గవర్నర్పై కొందరు దుండగులు దాడికి ప్రయత్నించడంతో, దాని వెనుక సీఎం పినరయి విజయన్ ఉన్నారని ఆరిఫ్ మహ్మద్ ఆరోపించారు.